ఈ దేశాలకు ఒకే కరెన్సీ అవసరం!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, బహుళ ధ్రువ ఆర్థిక వ్యవస్థను సాధించాలనే ఆకాంక్షతో బ్రిక్స్ దేశాలు ఒకే కరెన్సీ

Update: 2024-11-29 01:00 GMT

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, బహుళ ధ్రువ ఆర్థిక వ్యవస్థను సాధించాలనే ఆకాంక్షతో బ్రిక్స్ దేశాలు ఒకే కరెన్సీ ఏర్పాటుపై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఒకే కరెన్సీ వలన ఈ దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడం, అమెరికా డాలర్‌పై ఆధారాన్ని తగ్గించడం, ఈ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల ఆర్థిక ప్రభావాన్ని ప్రపంచ స్థాయిలో పెంచడం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, భారతదేశం దృష్టిలో ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యమా? దీని ప్రయోజనాలు భారత ప్రయోజనాలకు అనుకూలమా? అనే అంశాలను సవివరంగా విశ్లేషించాల్సి ఉంది.

భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి ప్రయత్నిస్తున్న ఈ సమయంలో, సాంకేతిక విప్లవాలు, వాణిజ్య మార్పులు, భౌగోళిక ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం, వృద్ధిని ప్రోత్సహించడం వంటి ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తోంది. దీనికి తోడు, భారత వ్యూహాత్మక లక్ష్యాలు.. వాణిజ్య పోటీతత్వాన్ని పెంచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్రను పొందడం ప్రధానమైనవి.

బ్రిక్స్ దేశాల ఒకే కరెన్సీ వలన..

బ్రిక్స్ దేశాలు ఒకే కరెన్సీ వినియోగించుట వలన భారతదేశానికి ప్రధానంగా మూడు ప్రయోజనాలు ఉంటాయి. మొదటగా, ఇది విదేశీ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. చిన్న మధ్యతరహా సంస్థలకు కరెన్సీ మార్పిడి రేటు అనే పెద్ద సమస్య అస్థిరతను తొలగించడం ద్వారా ఈ దేశాల మధ్య వాణిజ్య వ్యయాలు తగ్గవచ్చు. తద్వారా, చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు కొత్త మార్కెట్లు కనుగొని తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. రెండవది, డాలర్‌పై ఆధారాన్ని తగ్గించడం. బ్రిక్స్ ఒకే కరెన్సీ ద్వారా, డాలర్ వినియోగాన్ని తగ్గించి, భారతదేశ విదేశీ మారక నిల్వలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. మూడవది, ఇది భారతదేశానికి బ్రిక్స్ దేశాల్లో ప్రధానమైన పాత్రను కల్పిస్తుంది. ఈ పరి ణామం ఆర్థిక సమన్వయానికి బలమైన మద్దతు ఇస్తుంది. ఈ ప్రయోజనాలతో పాటు, బ్రిక్స్ ఒకే కరెన్సీ భారతదేశానికి కొన్ని ప్రధాన సవాళ్లను కూడా తెస్తుంది. భారతదేశం ద్రవ్య విధానాన్ని ప్రత్యేక ఆర్థిక అవసరాలకు సరిపోయే విధంగా రూపొందిస్తుంది. బ్రిక్స్ ఒకే కరెన్సీ స్వీకరించడం వల్ల భారతదేశం ఆ విధానాన్ని మార్చుకోవలసి రావడం వల్ల, ద్రవ్యోల్బణ నియంత్రణ ఆర్థిక లక్ష్యాల సాధనలో సమస్యలు తలెత్తవచ్చు. భారతదేశ ఆర్థిక వైవిధ్యం బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న అసమానతలకు కారణం కావచ్చు. ఉదాహరణకు, చైనా ఆర్థిక పరిమాణం భారతదేశానికి అయిదు రెట్లు ఎక్కువ. ఈ విభేదాలు బ్రిక్స్ ఒకే కరెన్సీ స్థిరత్వానికి ప్రమాదాన్ని కలిగించవచ్చు. యూరోజోన్ సంక్షోభం పాఠాలు బ్రిక్స్ ఒకే కరెన్సీ విషయంలో అప్రమత్తత అవసరమని సూచిస్తాయి. అంతేకాక, చైనాతో సరిహద్దు వివాదాలు రష్యాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు బ్రిక్స్ ఒకే కరెన్సీ స్థిరత్వానికి ముప్పుగా మారవచ్చు.

డాలర్‌పై ఆధారాన్ని తగ్గించేందుకు..

ఆర్థిక నిపుణులు బ్రిక్స్ ఒకే కరెన్సీ ప్రయోజనాలను గుర్తించినప్పటికీ, దాని ప్రమాదాలను కూడా హెచ్చరించారు. డా. రఘురామ్ రాజన్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ఒకే కరెన్సీ వలన ద్రవ్య విధాన స్వాయత్తం కోల్పోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంద ని అన్నారు. అలాగే, అరవింద్ సుబ్రమణియన్ వంటి ఆర్థిక నిపుణులు సరైన ఆర్థిక సమన్వ యం లేకపోతే, సమస్యలు మరింత తీవ్రమవుతాయని అభిప్రాయపడ్డారు. భారతదేశం బ్రిక్స్ ఒకే కరెన్సీని స్వీకరించకుండానే, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఉత్తమం. భారతదేశం ఇప్పటికే INR ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా స్థానిక మారకాలను ప్రోత్సహిస్తోంది. దీనిని బ్రిక్స్ దేశాలకు విస్తరించడం ద్వారా డాలర్‌పై ఆధారాన్ని తగ్గించవచ్చు. న్యూ డవలెప్‌మెంట్ బ్యాంక్ వంటి ప్రాంతీయ ఆర్థిక సంస్థలను బలపరచడం, యూపీఐ వంటి చెల్లింపు వ్యవస్థలను బ్రిక్స్ దేశాల్లో అనుసంధానించడం వంటివి వాణిజ్య వృద్ధికి సహాయపడతాయి. భారతదేశం తన వ్యూహాలను భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకోవాలి. బ్రిక్స్ ఒకే కరె న్సీ వలన వాణిజ్య వృద్ధి, ఆర్థిక సమన్వయం సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నప్పటికీ, దాని ప్రతికూల ప్రభావాలను భారతదేశం తప్పక గమనించాలి. భారతదేశం తన రూపా యి పాత్రను బలపరచడం, ఆర్థిక వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించడం వంటి మార్గాల ద్వారా అవసరాలను తీర్చుకోవాలి. ప్రజలు, ఆర్థిక నిపుణులు, పాలసీ మేకర్లు ఈ ప్రతిపాదనపై సమగ్ర చర్చలు జరిపి, భారత ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలమైన వ్యూహాలను రూపొందించాలి. ఈ విధంగా, భారతదేశం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మరింత శక్తివంతమైన భాగస్వామిగా మారవచ్చు. 

- డాక్టర్ శ్రీకాంత్ పోతరాల

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐబీఎస్, హైదరాబాద్

Tags:    

Similar News