విత్తనం వేస్తేనే కదా... మహా వృక్షం అయ్యేది!

తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కలిసి ఉన్నప్పటినుంచి బీసీలు రాజకీయ పార్టీ పెడతారని బలంగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి.

Update: 2024-11-28 01:15 GMT

తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కలిసి ఉన్నప్పటినుంచి బీసీలు రాజకీయ పార్టీ పెడతారని బలంగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇంతవరకు ఆ వార్తలు కార్యరూపం దాల్చక పోవడం గమనార్హం. ఇప్పటి వరకు బీసీల రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఏ ఒక్క నాయకుడు నడుం బిగించిన దాఖలాలు లేవు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చాలా బలీయమైన శక్తిగా ఉన్నారనేది నిర్వివాదాంశం. రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం, ఇటీవల కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షునిగా బీసీ అభ్యర్థిని నియమించడం రాష్ట్రంలో బీసీలు బలంగా ఉన్నారనేదానికి నిదర్శనం. తెలంగాణాలో రాజ్యాధికారం వైపు బీసీలు వేసే అడుగులు దేశం లోని బీసీలకు కూడా మార్గదర్శంగా నిలుస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.

తెలంగాణా రాష్ట్రంలో సుమారు 58 శాతం బీసీలు ఉన్నారు. రాష్ట్రంలోని బీసీలలో ఉన్న పోరాట పటిమ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేదనే చెప్పాలి. తమ హక్కుల సాధన కొరకు తెలంగాణాలోని బీసీలు చేసే ఉద్యమాలు దేశానికి ఆదర్శమనడంలో సందేహం లేదు. బీసీ కులాల జనగణన చేయడంలో తెలం గాణా రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాప్యం చేస్తుంటే బీసీ సంఘ నాయకులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించారు. మూడు నెలలోపు బీసీల జన గణన పూర్తి చేయమని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీల జనాభాను అధికారికంగా లెక్కించడం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సహేతుకంగా కనిపించింది.

బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు..

తెలంగాణా రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సమయంలో 2023 నవంబర్ 9 తేదీన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఆ బీసీ డిక్లరేషన్ పట్ల ఆకర్షితులైన అత్యధిక శాతం బీసీలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. పర్యవసానంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పటి టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావు థాక్రే, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతల సమక్షంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక హామీలు ఆ డిక్లరేషన్‌లో పొందుపరిచారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడుస్తున్నా బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త వెనుకబడింది.

సంపూర్ణ కులగణనకు ఓకే...

బీసీ కులగణన, స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ అమలు చేయమని రాష్ట్రంలోని బీసీ సంఘాలు అన్నీ ఉద్యమ బాట పట్టాయి. చివరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు, బీసీ సంఘాల ఉద్యమ తీవ్రతకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల్లోపు రాష్ట్రంలో సంపూర్ణ కుల గణన చేయాలని నిర్ణయం తీసుకుంది. కులగణన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని, బీసీల రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేసేందుకే రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ పరిణామం కచ్చితంగా రాష్ట్రంలోని బీసీలు సాధించిన విజయమనడంలో ఎటువంటి సందేహం లేదు. బీసీ సంఘ నాయకుల ఉద్యమ స్ఫూర్తిని కూడా ఈ సందర్భంగా అభినందించాలి. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని బీసీ సంఘాలు, నాయకులు ఒకే వేదికపైకి వస్తే బీసీల రాజకీయ పార్టీ ఆవిర్భావాన్నీ, బీసీలు అధికారంలోకి రావడాన్నీ ఏ శక్తీ అడ్డుకోలేదు.

పాలకులకు కనపడని బీసీలు..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యధికంగా నష్టపోయింది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా 56 శాతం పైగా ఉన్న వెనుకబడిన తరగతుల వారే అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశంలోని బీసీల జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారిపోయి అన్ని రంగాలలో వెనుక బడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో ఉన్న రాజకీయ పార్టీల కుటిల బుద్దే అని కచ్చితంగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 43 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది. ఆ సమయంలో ఒక్క బీసీ వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి స్థానంపై కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టలేదన్నది చేదు వాస్తవమే.

బీసీలను గాలికొదిలేసిన బీజేపీ

అదే విధంగా ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున బీసీని ముఖ్యమంత్రి చేస్తానని బీజేపీ ప్రకటించింది. అదే బీజేపీ కేంద్ర పరిధిలోని బీసీ కుల గణన, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కేటాయించడం వంటి అనేక బీసీలకు సంబంధించిన విషయాలను గాలికి వదిలేసింది. బీసీల సమస్యలు పరిష్కరించకుండా బీసీలు ఈ పార్టీలను ఎందుకు నమ్ముతారు? వ్యక్తిగత పార్టీలైన ప్రాంతీయ పార్టీలకు బీసీల అభివృద్ది పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీల కులగణన చేయాలంటే దేశంలోని ప్రాంతీయ, రాజకీయ పార్టీలకు భయం. చిత్తశుద్దితో శాశ్వత పథకాలు అమలు చేసి బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే దేశం యావత్తు పాలనా పగ్గాలు వారి చేతుల్లోకి పోతాయని రాజకీయ పార్టీలు బావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

రాజ్యాధికార బాటలో బీసీలు సాగాల్సిందే!

ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి రాజకీయ పార్టీలు గత ఏడు దశాబ్దాలుగా తమకు న్యాయం చేయడం లేదని భావించి రాజ్యాధికారంలో తమ జనాభాకు తగిన ప్రాతినిధ్యాన్ని సంపాదించుకొని తమ జాతుల జీవితాలు బాగు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ బీసీ లను రాజ్యాధికారం వైపు నడిపించే నాయ కత్వం మాత్రం కనిపించడం లేదు. దీనికి దశాబ్దాల తరబడి తమ జాతుల హక్కుల కొరకు ఉద్యమాలు చేస్తున్న నాయకులు, ఉన్నత స్థానాలలో రిటైర్ అయిన ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగులు, విద్యాధికులు, మేధావులు ఎటువంటి భేషజాలకు పోకుండా పంతాలు, పట్టింపులు పోకుండా ఒకే వేదిక పైకి వచ్చి మొత్తం సంఘా లను, నాయకులను, ప్రజలను ఒకే తాటి పై నడిచేటట్లు చర్యలు తీసుకుని రాజకీయ పార్టీ స్థాపించి బీసీ జనానికి రాజ్యాధికార బాట చూపించవలసిన ఆవశ్యకత ప్రస్తుతం అధికంగా ఉంది. పార్టీ పెట్టిన వెంటనే సత్పలితాలు రాకపోవచ్చు. అనేక ఒడిదుడుకుల అనంతరం కచ్చితంగా బీసీలు రాజ్యాధికారం సంపా దించే అవకాశం అత్యధికంగా ఉంది. తెలంగాణా రాష్ట్రం లో రాజ్యాధికారం వైపు బీసీలు వేసే అడుగులు దేశంలోని బీసీ లకు కూడా మార్గదర్శంగా నిలుస్తాయని కచ్చితంగా చెప్ప వచ్చు. విత్తనం వేస్తేనే కదా మహావృక్షమై పదిమందికి నీడనిచ్చేది.

కైలసాని శివప్రసాద్

94402 03999

Tags:    

Similar News