సత్యశోధకుడు, సంఘసేవకుడు ఫూలే
గౌతమ బుద్ధుడు తరువాత భారతదేశంలో జ్యోతిభాఫూలే, బి.ఆర్.అంబేద్కర్ వంటి మహనీయులు సమన్యాయం కోసం పోరాడారు. గాంధీజీ కంటే ముందే
గౌతమ బుద్ధుడు తరువాత భారతదేశంలో జ్యోతిభాఫూలే, బి.ఆర్.అంబేద్కర్ వంటి మహనీయులు సమన్యాయం కోసం పోరాడారు. గాంధీజీ కంటే ముందే మహాత్మగా పిలువబడ్డ జ్యోతిభా ఫూలే అంబేద్కర్ వంటి మహనీయునికి స్ఫూర్తినిచ్చారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవారు. కాలక్రమేణా వారు పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది. ఆయన వితంతు పునర్వివాహాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.
భారతదేశంలోని శూద్రాతి శూద్రులు బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు. బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మ ణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించి ఎన్నో పాఠశాలలు ప్రారంభించాడు. ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించారు. 1864లో "బాలహత్య ప్రతిబంధక్ గృహ" స్థాపించి, వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచారు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారతదేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా. బి.ఆర్. అంబే ద్కర్ ప్రకటించారు. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసిన కృషికి ఆయనకు ఆనాటి సంఘ సంస్కర్త విఠల్ రావు కృష్ణాజీ వందేకర్ ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. అంటరాని తనం, వితంతు వివాహాల నిషేధం వంటి సాంఘీక అసమానతలను రూపుమాపిన జనోద్దారకుడు ఫూలే. నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే కొంతకాలం దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ 1890, నవంబరు 28న కన్నుమూశారు. ఫూలే తన సతీమణి సావిత్రి బాయి ఫూలేతో కలిసి పలు సాంఘిక ఉద్యమాలు చేశారు.
(నేడు ఫూలే వర్ధంతి సందర్భంగా...)
- గుమ్మడి లక్ష్మీ నారాయణ
94913 18409