ఆరోగ్యం సామాజికం కావాలి!

ఆరోగ్యం ఎల్లప్పుడూ సామాజికమే. సమాజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ సమాజాన్ని కూడా

Update: 2024-11-29 01:15 GMT

ఆరోగ్యం ఎల్లప్పుడూ సామాజికమే. సమాజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచగలుగుతాడు. రెండూ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. నేను మాత్రమే ఆరోగ్యంగా ఉంటాను. నా చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉన్నా, నాకు అనవసరం అనే ఆలోచన నన్ను కూడా ఆరోగ్యంగా ఉంచని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన సమాజంలో మాత్రమే వ్యక్తులు సమిష్టిగా ఆరోగ్యంగా ఉంటారు. విడివిడిగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. మనం ఎనభై సంవత్సరాలు బతకాలంటే మన పక్క వాడికి కూడా ఎనభై సంవత్సరాలు బతికించాలి. మనం శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన పొరుగు వాడికి కూడా శారీరకంగానూ, మానసికంగానూ , సామాజికంగానూ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మన వంతు పాత్రను మనం నిర్వర్తించాలి. అప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన సమాజంలో మరలా ప్రతి ఒక్కరూ విడివిడిగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విడివిడిగా ఆరోగ్యంగా ఉన్నవారు మొత్తం సమాజాన్ని ఆరోగ్యం గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా నిరంతరం కొనసాగే ప్రక్రియ ద్వారా ఆరోగ్యం అందరికీ లభించి దేశం అభివృద్ధి చెందుతుంది. నేను మాత్ర మే బాగా ఉంటాను, నా జీవితం మాత్రమే నేను చూసుకుంటాను అనే భావజాలం ఒక ప్రత్యేక వ్యవస్థ మనకు అందించే నెగిటివ్ భావజాలం. ఇది మనల్ని విడివిడిగానూ ఆరోగ్యంగా ఉంచదు. ఆనందం ఇవ్వదు. సామాజికంగానూ, సమూహంలోనూ మనల్ని ఆరోగ్యంగా ఉంచదు. ఫలితంగా, మొత్తం హ్యాపీనెస్ ఇండెక్స్‌లో దేశం వెనకబడిపోతుంది. డబ్బున్న వర్గం ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకున్నా సరే వారు కూడా ఎన్నెన్నో పారా మీటర్లలో ఆరోగ్య కరంగా లేక అశాంతితో జీవితం గడుపుతుంటారు.

అనారోగ్యం వ్యక్తిగతం కానేకాదు..!

అవతలి వ్యక్తి ఆరోగ్యం గురించి మనం ఆలోచించకపోయినప్పుడు, ఆ వ్యక్తికి వచ్చే శారీరక అనా రోగ్యాలు మరో వంద మందికి ఆ వ్యక్తి అంటిస్తాడు. ఆ వందమంది మరో వెయ్యి మందికి సంక్రమింపజేస్తారు. కరోనా సమయంలో మనం ఇలాంటిదే చూ శాం. అలానే, అవతలి వ్యక్తి మానసికంగా ఆరో గ్యంగా ఉండకపోతే, ఇతరులతో కూడా సానుకూలమైన వ్యవహారంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అప్పుడే సామాజిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ ఇంట్లో సౌండ్ బాక్స్‌లో పాటలు తక్కువ వాల్యుంలో వేయండి అని అన్న చిన్న మాటకే అవతలి వ్యక్తి పెద్దగా రియాక్ట్ అయ్యి మనల్ని కొట్టేయొచ్చు. అలానే, చంపేయచ్చు కూడా. అమ్మాయి తన ప్రేమ ప్రపోజల్‌ను అంగీకరించలేదని అమ్మాయి మీద కుర్రాడు అఘాయిత్యం తలపెట్టవచ్చు. కాబట్టి సామాజిక ఆరోగ్యం అవసరం. ఇలా సమాజంలో ప్రతి సంఘటన మనకు తెలియకుండానే మన మీద కూడా ప్రభావం కలిగిస్తుంది. కాబట్టి, సామాజిక అనారోగ్యం కూడా వ్యక్తిగతం కాదు. సామాజికం. వ్యవస్తాగతం. వ్యవస్థ మొత్తం బాధ్యతాయుతమైన ప్రణాళిక ద్వారా దీన్ని నయం చెయ్యాలి. వ్యక్తి తనకు తానే నయం చేసుకోవడానికి ప్రయత్నించినా అది మొత్తం సమాజాన్ని ఆరోగ్యంగా మార్చదు.

మానసిక అనారోగ్యంపై అంధకారం

ప్రపంచీకరణ ఫలితంగా, వేలకొలది ప్రజానీకం నేడు మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. కొత్త జీవన శైలి కారణంగా శారీరక అనారోగ్యాలు పెరిగిన మాట కాదనలేం. కానీ దాంతోపాటు, మానసిక, సామాజిక అనారోగ్యం కూడా ప్రజల్లో పెరుగుతోంది. ఎమోషనల్‌గా ఎంతోమంది అనా రోగ్యం పాలవుతున్నారు. మనిషి అస్తవ్యస్తమైన అస్థిరతతో కూడిన వ్యవస్థలో జీవించాల్సి వస్తుంది. మనిషికి మనిషికి మధ్య ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర పెట్టుబడిదారీ దేశాల కంటే కూడా భారతదేశంలో ఈ రోగులు పెరుగుతున్నారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. విద్యా విధానం అందరికీ ఉపాధి కలిగించే విధంగా లేదు. కొంతమంది డబ్బున్న వర్గం సకల సౌభాగ్యాలు ఆనందిస్తున్నారు. తొంభై శాతం కంటే ఎక్కువ జనాలు నలిగిపోతున్నారు. ఉద్యోగాలు లేవు. ఇక ఉద్యోగాలు చేసే కొద్దిమంది కూడా ఉద్యోగాలు ఇచ్చే ఒత్తిడిలో నలుగుతున్నారు. టార్గెట్లు అని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి, మానసిక అనారోగ్యం కూడా ఈ జనాభాలో విపరీతంగా ఉంది. డిప్రెషన్ ఉంది. యాంగ్జైటీ ఉంది. వీటన్నిటికీ కూడా వ్యక్తి మాత్రమే కారణం అని అనలేం. ప్రతి సమస్యకు వ్యక్తిని దోషిగా నిలబెట్టలేం. వ్యవస్థాగత వైఫల్యాలు వీటి వెనక మనం చూస్తాం. మానసిక అనారోగ్యం విషయంలో సమాజంలో స్టిగ్మా ఉంది. శారీరక అనారోగ్యం వస్తే రోగిని వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్తారు. నయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విషయంలో ఏ రకమైన సోషల్ స్టిగ్మా ఉండదు. కానీ, మానసిక అనారోగ్యం వచ్చేటప్పటికి సమాజంలో ఎక్కడ లేని అంధకారం కనిపిస్తుంది.

బాబాలు తయారయ్యే క్రమం ఇదే!

మానసిక అనారోగ్యానికి గురైన వ్యక్తులు, తమ ప్రవర్తనలో ఎన్నో రకాల వింత చేష్టలు చూపిస్తారు. అవి వారికి తెలీవు. వారికి తెలియకుండానే చుట్టుపక్కల వ్యక్తులు పరిశీలిస్తారు. విపరీతమైన కోపంలో ఉంటా రు. విపరీతమైన రియాక్షన్ చూపిస్తారు. పదిమందిలో కలవకుండా ఒక మూలకి వెళ్ళిపోతారు. డిప్రెష న్‌కి గురవుతారు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా ముదిరితే రోడ్లమీద కాగి తాలు ఏరుకుంటారు. తమలో తాము మాట్లాడుకుంటారు. మనకు కనిపించని వ్యక్తులు వాళ్ళకి కనిపిస్తారు. ఆ కనిపించని వ్యక్తులతో వాళ్ళు మాట్లాడతారు. ఇలాంటి కొంతమందిని మన సమాజం బాబాలుగా తయారు చేసేస్తుంది. ఎవరో ధైర్యం చేసి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ వ్యక్తికి సమాజం పిచ్చోడి కింద జమ కడుతుంది. ఆ వ్యక్తి పిచ్చోడైపోయాడని ప్రచారం చేస్తుంది. ఫలితంగా, మరింత మానసికంగా కుంగదీస్తుంది. ఆ కారణంగా, ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురైన రోగులూ, వారి ఇంటి వారూ బయటకి ఏమీ చెప్పలేని విషమ పరిస్థితుల్లో ఉంటారు. వైద్యుల దగ్గరికి వెళ్లడానికి కూడా రోగి ఇబ్బంది ఫీలవుతాడు. కుటుం బం కూడా చాలా రహస్యంగా ఆ అనారోగ్యాన్ని ఉంచాలని అనుకుంటుంది. ఇంత దారుణమైన భావజాలం సమాజంలో ఉన్నప్పుడు సమాజమంతా కూడా ఆరోగ్యంగా ఉండడం సాధ్యం కాదు. అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నాసరే, సోషల్ స్టిగ్మా అలాంటిది.

ఆరోగ్యకరమైన సమాజమే దేశ పునాది!

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం సమాజం కూడా తనవంతు పాత్రను నిర్వర్తించాలి. ఆయా రోగుల విషయంలో మనం మనిషిగా మానవత్వంతో చూడాలి. వారిని నయం చేయడానికి మన వంతు పాత్రను నిర్వర్తించాలి. డిప్రెషన్ గాని, యాంగ్జైటి గానీ, ఓసిడి గాని ఎలాంటి సమస్యలు ఉన్నా మానసిక వైద్యుల దగ్గర సలహా తీసుకొని వారిని నయం చేయించడానికి ప్రయత్నించాలి. వారి పట్ల మానవత్వంతో చూడాలి. అప్పుడే మన సమాజం సామూహికంగా ఆరోగ్యాన్ని సంపాదించి ఒక ఆరోగ్యకరమైన సమాజానికి పునాది వేస్తుంది. ఈ ఆరోగ్యకరమైన సమాజం ఒక అభివృద్ధికరమైన దేశానికి పునాది వేస్తుంది.

జాతీయం చేయాల్సింది... కట్టబెట్టేశారు!

ఇదిలా ఉంటే, పాలసీ పరంగా మన దేశంలో మనం రెండు పొరపాట్లు చేశాం. ఒకటి, ఇంతగా ప్రాధా న్యత ఉన్న హెల్త్ సెక్టార్ జాతీయం చేసి మరింత పటిష్టంగా మార్చాల్సి ఉండగా, ఈ రంగాన్ని అందుకు విరుద్ధంగా కార్పొరేట్ల చేతుల్లో పెట్టారు. రెండు, ఎవరెలా పోతే నాకెందుకు? అనే తిరోగమన భావజాలం ప్రజల్లో ఇంజెక్ట్ చేసారు. 1990ల నుంచి ప్రపంచీకరణ విధ్వంసక అభివృద్ధికి ప్రజలు ఏకమై అడ్డు తగలకుండా ఉండడానికి దీన్ని మరింత ప్రణాళికా బద్ధంగా పౌరుల నరాల్లో ఇంజెక్ట్ చేశారు. ఫలితంగా, పౌరులు క్రియాశీల పాత్ర నుంచి పక్కకు జరిగారు. నాయకులకు చప్పట్లు కొట్టే ప్రేక్షకులుగా మారిపోయారు. ప్రశ్న నాయకుల భజనలోకి రూపాంతరం చెందింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజలకు సంబంధించిన అన్ని రంగాలు ప్రభావితం అయ్యాయి. ఆరోగ్య రంగం మరింత దెబ్బతింది. అందుకే, ఆరోగ్యం సామాజికం కావాలి.

- కేశవ్

జాగృతి సమీక్ష సంపాదకులు

98313 14213

Tags:    

Similar News