అమానుష పోకడలపై నిరసన మనిషి

తత్వవేత్తలు చేసిన బోధనల సారాన్ని, ప్రముఖులు చేసిన ప్రసంగాల సారాం శాన్ని 35 పదాల చిరు కవితలో గుప్పిం చాడు గురజాడ. ఆయన కవితలోని కర్త

Update: 2024-11-30 00:30 GMT

తత్వవేత్తలు చేసిన బోధనల సారాన్ని, ప్రముఖులు చేసిన ప్రసంగాల సారాం శాన్ని 35 పదాల చిరు కవితలో గుప్పిం చాడు గురజాడ. ఆయన కవితలోని కర్త, కర్మ రెండూ కూడా మనిషే. ఈ మనిషి ఏదో ఒక ప్రాంతానికి, దేశానికి, మతానికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు. గురజాడ సాహిత్యంలో మనకి కనిపించే సామాజిక వ్యాఖ్యను, సామాజి క చింతనను, సామాజిక స్పృహను వ్యక్తం చేసే క్రమానికి ‘మనిషి’ కవితను నాందీ ప్రస్తావనగా చూస్తే ఆయన ఆ కాంక్షలు, ఆశలు, నిరాశాలు విశిధమవుతాయి.

దేవుడి పేరుతో, బాబాల పేరుతో అమా యక ప్రజలని ఆకట్టుకుని మోసం చేసే వారి నైజాన్ని శతాబ్దం క్రితమే ఎండగట్టాడు గురజాడ. ‘మీ పేరేమిటి’ కథలో శివ, వైష్ణవ వైషమ్యాల నేపథ్యంలో పీర్ల బాబాను ప్రవేశపెట్టి మతం పేరుతో మనుషులను మరలుగా మార్చే మత పెద్దల మతలబుని తేటతెల్లం చేసిన తీరు అమోఘం. ఈ కథానికలో గురజాడ ఆవిష్కరించినది 'మనిషి'నే. కాసుల కోసమో, ఆధిపత్యం కోసమో వేరే ఇతర ప్రలోభాలకు లోబడి మతం మార్చుకునే మనిషి నైజాన్ని చిరు కథానిక ‘పెద్ద మసీదు’లో చూపెట్టాడు గురజాడ. ఆ కథలో గురజాడ రాసినదీ ‘మనిషి’ గురించే. ఆధిపత్యం కోసం మతా న్ని వాడుకునే ఆలోచన గల మనిషి తనకి అనువైన, నచ్చిన మాటలని, ఏ పుస్తకాల నుండైనా, శాస్త్రాల నుండైనా స్వీకరించి బాబాలుగా, స్వామీలుగా రూపాంతరం చెంది మనిషిని తలూపే పశువుగా మారు స్తాడు. బలహీనత వల్లనో, అవసరం కోస మో మారతారు కొందరు. మారిన వాడూ మనిషే, మార్చిన వాడూ మనిషే! గురజాడ ఎవరిని వస్తువుగా స్వీకరించి మనిషి కవిత రాసారు? ఎవరి స్థితికి కరిగి రాశారు?

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే’ అం టూ హీనాధిక భేదాలు లేకుండా అందరిలోనూ ఉండే అంతరాత్మ పరమాత్మ అయిన ఆ శ్రీహరియే అని తాత్త్విక చింతనను ప్రతిపాదించిన అన్నమయ్య కీర్తనని, “సర్వభూతస్థితం యో మాం” అంటూ ప్రతీ జీవి యందు భగవంతుడు ఉన్నాడని స్థిరపరచిన భగవద్గీత సారాన్ని, “మనిషి మాత్రుడియందు లేడో” అంటూ కొన్ని పదాలలో వ్యక్తీకరించిన గురజాడ ‘భావార్థ శాసనుడే’ అని చెప్పాలి.

‘‘మొన్న పట్ణము నందు ప్రాజ్ఞులు/మొట్ట మొదటిది మెట్టు యిది యని,/పెట్టినారొక విందు జాతుల జేర్చి; వినవైతో’’– అంటూ 1909 లో బరంపురంలో జరిగిన సకలవర్ణ సహపంక్తి భోజనాలను 1910 లో రాసిన ‘ముత్యాల సరములు’ ఖండి కలో ప్రస్తుతించాడు; “---యెల్ల లోక ము వొక్క యిల్లై,/వర్ణ భేదము లెల్ల కల్లై”, మనుషులందరు ఒకటిగా మెలిగే సమాజానికి తొలి అడుగు పడిందని ఆనందించాడు గురజాడ.

“మనిషి చేసిన రాయి రప్పకి/మహిమ కలదని సాగి మొక్కుతు” – అని కవిత మొదలుపెట్టాడు కాబట్టి గురజాడ నాస్తికుడని కొందరు ప్రచారం చేసి సొమ్ము చేసుకున్నారు కూడా. మూఢుడైన మనిషి పోకడని ఎండగట్టడానికి వేసిన ఎత్తుగడ అని కవితని పూర్తిగా కలిపి చదివితే అర్థం అవుతుంది.

మానవ జాతి భౌతికంగా ఎంత పురోగతి సాధించినా, ‘మనిషి’ పరిణామం చెందలేదన్నది నిష్ఠూరమైన కాదనలేని సత్యం. గురజాడ ‘మనిషి’ కవిత ఈ వాస్తవాన్ని నిరసన పూర్వకంగా, ఆలోచించే దిశగా ఎత్తిచూపుతుంది.

(నేడు గురజాడ వర్ధంతి)

- డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ

'ప్రకాశిక' సంపాదకులు, అమెరికా

Editor@prakasika.org

Tags:    

Similar News