పాఠశాల స్థాయిలోనే నైపుణ్య విద్య అందించాలి!

ఈ పోటీ ప్రపంచంలో ముందు వరసలో ఉండాలంటే కొన్ని మెళుకువలపై నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. కొత్త కోర్సులను అనునిత్యం అనుసరిస్తానే ఉండాలి.

Update: 2024-11-30 01:00 GMT

ఈ పోటీ ప్రపంచంలో ముందు వరసలో ఉండాలంటే కొన్ని మెళుకువలపై నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. కొత్త కోర్సులను అనునిత్యం అనుసరిస్తానే ఉండాలి. అసలే పోటీ ప్రపంచం.. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు లక్షలాది మంది పోటీ! ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడమే గగనంగా మారడంతో కంపెనీలే మీ వైపు చూడాలంటే ఎన్నో నైపుణ్యాలు అలవర్చుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా 2027 నాటికి 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో 8.3కోట్ల ఉద్యోగాలు మాయమవుతాయని ఈ మధ్య ప్రపంచ ఆర్థిక నివేదిక అంచనా వేసింది. అంటే ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికే ఉద్యో గ అవకాశాలు ఉంటాయన్నమాట. డిమాండ్‌కి తగిన సంఖ్యలో నిపుణులు దొరక్క అనేక సంస్థలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు లేకపోలేదు. సాంకేతిక నైపుణ్యం, వ్యక్తిగత కౌశలం మేళవించిన వారు మాత్రమే ఉద్యోగాలు దక్కించుకోగలుగుతున్నారు. వివిధ కంపెనీలు ప్రాంగ ణ నియామకాల్లో నైపుణ్యానికే పెద్దపీట వేస్తున్నాయి. వీటితో పోలిస్తే విద్యార్థులు పరీక్షల్లో సాధించిన మార్కులు, చేసిన ప్రాజెక్టులు, సిఫారసులను అవి పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

కాలేజీలో ఉన్నప్పటినుంచే..

కళాశాలలో ఉన్నప్పుడే వీలైనన్ని ఎక్కువ స్కిల్స్‌ నేర్చుకొనే ప్రయత్నం చేస్తేనే మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోగలం. ఉద్యోగాన్వేషణలో మీకు అవెంతో ప్లస్‌ అవుతాయి. ఏ ఉద్యోగానికైనా కచ్చితంగా కావాల్సింది భావ వ్యక్తీకరణ నైపుణ్యం. ఎదుటి వారికి మీరేం చెప్పాలనుకొంటున్నారో సమర్థంగా వ్యక్తపరిచేందుకు ఈ నైపుణ్యమే కీలకం. ఇది సరిగా లేకపోతే అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దేశవ్యాప్తంగా ఏటా కొత్తగా పట్టాలు పుచ్చుకుని దాదాపు 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉపాధి వేటలో పడుతున్నారు. వీరిలో చాలా మందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఉండడం లేదనేది నిజం. అందుకే పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా స్కిల్స్‌ నేర్చుకుంటే దాదాపు ఉద్యోగం వచ్చేసినట్లే! ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని దూసుకుపోయే తత్వం, టీమ్‌ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పనిచేయగలగడం, సమస్యలకు పరిష్కారాలు చూపగలగడం అవసరం. మంచి టీమ్ వర్క్‌కు ఇతరులతో కలిసి పనిచేయడం వారితో కలిసి పనిచేయడం సౌకర్యవంతంగా ఉండటం అవసరం. అలాగే భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ ఎంతో కీలకం. కాలేజీ దశలో ఉన్నప్పట్నుంచే ఏ కోర్సు నేర్చుకుంటే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చో నిరంతరం శోధిస్తుండాలి. అందుకు తగ్గట్టుగా సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే బయటకు వచ్చాక ఉద్యోగం గురించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.

కంప్యూటర్ నైపుణ్యాలు అవసరం!

కేవలం సబ్జెక్టుపై పట్టు ఉన్నంత మాత్రాన సరిపోదు. బృందంలో ఇమిడిపోయే మనస్తత్వం, ఛాలెంజ్‌లను స్వీకరించగలగడం, నాయకత్వ లక్షణాలు, కస్టమర్‌ సర్వీస్‌- మేనేజ్‌మెంట్‌, టైం మేనేజ్‌మెంట్‌ ప్రపంచ మార్కెట్‌కు అవసరమయ్యే నైపుణ్యాలకనుగుణంగా అప్‌డేట్‌ అయితే.. ఏ కంపెనీలూ మిమ్మల్ని వదులుకోవు. మార్కెట్‌ అవసరానికి తగ్గట్టు కంపెనీలకు కావాల్సింది సవాళ్లను స్వీకరించి పనిచేసే నైపుణ్యం కలిగిన సిబ్బందే. ప్రపంచంలో వస్తున్న కొత్త మార్పులపై మేధోమథనం చేసి తగిన పరిష్కారాలు చూపేవారు, సమస్యా పరిష్కార ఆలోచనా దృక్పథం ఉన్న వారినే కంపెనీలు ఎంచుకొంటాయి. సమయ పాలనకు ప్రియారిటీ ఇచ్చేలా ఉన్న మీ అలవాటును రెజ్యూమ్‌కు జత చేస్తే ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకు మీపై మంచి ఇంప్రెషన్‌ కలుగుతుంది. డిజిటల్‌ యుగంలో ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంతో అవ సరం. కంప్యూటర్‌పై లోతైన పరిజ్ఞానం అవసరమైన ఉద్యోగాలే మార్కెట్లో అధికంగా ఉన్నాయి. అందువల్ల మీరు నేర్చుకున్న కంప్యూటర్‌ నైపుణ్యాలను రెజ్యూమ్‌లో హైలైట్‌ చేయాలి. ఓపెన్‌ మైండ్‌(Open Mind)తో పని చేయడమూ మరో కీలక నైపుణ్యమే. ఏదైనా కంపెనీలో ఒక హోదాలో పనిచేస్తే.. కొత్త కంపెనీకి మారేటప్పుడు అదే పనిని అక్కడ విభిన్నంగా చేయాల్సి రావొచ్చు. అందు వల్ల అక్కడి పరిస్థితికి అనుగుణంగా పని చేసేందుకు ఈ నైపుణ్యం అవసరం. నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవడానికి సంసిద్ధంగా ఉండటం ఉద్యోగులు/ఉద్యోగార్థులు అలవర్చుకోవాల్సిన గొప్ప నైపుణ్యం.

పాఠశాల స్థాయి నుండే..

ఇక మీరు పనిచేసేచోట వర్క్‌ ఎథిక్స్‌ (Work Ethics) పాటించడం అద్భుతమైన నైపుణ్యం. ఎథిక్స్‌ కలిగి ఉండటం వల్ల ఎలాంటి పర్యవేక్షణ అవసరం లేకుండానే మీ పనిని మీరు ముగించేందుకు దోహదపడుతుంది. దీనికితోడు యాక్టి‌వ్‌గా వినడం, ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడం, గెలుపోటములను స్వీకరించే స్వభావం, సహనశీలత వంటి లక్షణాలు మిమ్మల్ని ఆకర్షణీయంగా, ఇతరుల నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. జీడీపీ మెరుపులకు సమాంతరంగా జన జీవితాల్లోనూ వెలుగులు నిండాలంటే- ఉపాధి సహిత అభివృద్ధి విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యలో వృత్తి శిక్షణను అంతర్భాగం చేయాలి. ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే విద్యను దేశ యువతకు అందించాలి. భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కృత్రిమ మేధ, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, డేటా సైన్స్ వంటి అధునాతన కోర్సులను ప్రవేశపెట్టాలి. నైపుణ్య విద్యకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి.

-డా .కృష్ణ సామల్ల

ప్రొఫెసర్

97058 90045

Tags:    

Similar News