విద్యార్థులను బలిగొంటున్న పైశాచిక క్రీడ.. ర్యాగింగ్
ర్యాగింగ్ ఓ పైశాచిక క్రీడ. ఏళ్ల క్రితమే బ్యాన్ అయిన ర్యాగింగ్ భూతం.. మళ్లీ కోరలు చాస్తోంది. సీనియర్ల ఆధిపత్యం, వివక్ష ఇలా అనేక రూపాల్లో
ర్యాగింగ్ ఓ పైశాచిక క్రీడ. ఏళ్ల క్రితమే బ్యాన్ అయిన ర్యాగింగ్ భూతం.. మళ్లీ కోరలు చాస్తోంది. సీనియర్ల ఆధిపత్యం, వివక్ష ఇలా అనేక రూపాల్లో ఉన్నానంటూనే తన ఉనికిని చాటుకుని విద్యార్థులను బలి తీసుకుంటోంది. కారణమేదైనా.. కోటి ఆశలతో కళాశాలల్లోకి అడుగుపెట్టిన పిల్లలకు ర్యాగింగ్ తీరని సమస్యగా మారింది. వారి తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగుల్చుతోంది.
ర్యాగింగ్.. ఒకప్పుడు పాఠశాల, కళాశాల అనే భేదం లేకుండా ప్రతి విద్యాలయంలో ఉండేది. దీనికి ఎంతో మంది విద్యార్థులు బలయ్యారు. అందుకే దీన్ని నిరోధిం చడానికి ప్రత్యేకంగా చట్టాలు సైతం తీసుకొచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఫలితాలు కనిపించాయి. అంతా సక్రమంగా ఉంది. ఎక్కడా ర్యాగింగ్ లేదు అని అనుకు న్న తరుణంలో.. వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నంతో ఈ భూతం మళ్లీ తెరమీదకు వచ్చింది.
విద్యావ్యవస్థలో ర్యాగింగ్ కలవరపెట్టే వాస్తవం!
వరంగల్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న ప్రీతి అనే అమ్మాయి... తనను సీనియర్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆత్మహత్యకు యత్నించి మరణంతో పోరాడి చివరికి కన్ను మూసింది. ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ చదువుతున్న దర్శన్ సోలంకి అనే విద్యార్థి సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు మరువకముందే ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ స్టూడెంట్‌కు గుండు కొట్టించాడు. ర్యాంగింగ్‌ను నిర్మూలించాల్సిన అధ్యాపకులే విద్యార్థిపట్ల దారుణంగా ప్రవర్తించటం అమానుషం. మన దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థలో ర్యాగింగ్ అనేది కలవరపెట్టే వాస్తవం.
జూనియర్లపై వివక్ష తగ్గలే...
ఎదుటివారి నిస్సహాయక పరిస్థితే ఇవతలి వాడికి అనుకూల పరిస్థితి. కొంతమంది విద్యార్థులలో ఇది ర్యాగింగ్ రూపంలో బయటపడుతుంది. దీని వలన అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. వేలాది మంది తెలివైన విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతున్నాయి. లోతుగా చూస్తే ఇది జూనియర్లపై వివక్ష చూపడమే. ఈ వివక్ష అనేది రంగు, జాతి, మతం, కులం, లింగం, ప్రాంతీయత, పుట్టిన ప్రదేశం, నివాస స్థలం, ఆర్థిక నేపథ్యం వంటి అనేక రూపాలలో ఉంటుంది. జూనియర్ శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అధిక స్థాయిలో ఉంటే ర్యాగింగ్ చేయడానికి భయపడతారు. నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న హర్ష ఘటన మరువకముందే ఇటీవల నల్లగొండ మెడికల్ కాలేజీ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయ డంతో 5 ఐదుగురు విద్యార్థులు సస్పెన్షన్‌కి గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం...
కఠిన చట్టాలున్నాయి. కానీ ఏం లాభం?
కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లయితే యాజమాన్యం, ప్రిన్సిపల్ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కమిటీ కొన్ని బలమైన సిఫార్సులు చేసింది. క్యాంపస్‌లలో ర్యాగింగ్ కేసుల పెరుగుదల సమస్యను పరిష్కరించడానికి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి) ఉన్నత విద్యా సంస్థలలో ర్యాగింగ్ ముప్పును అరికట్టడంపై నిబంధనలు 2009 పేరున తీసుకువచ్చింది. దీని ప్రకారం ర్యాగింగ్‌కి పాల్పడిన వారికి సస్పెన్షన్లు విధించవచ్చని, స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌లు నిలిపివేయొచ్చు. పరీక్షలకు హాజరు కాకుండా డీబార్ , పరీక్షల ఫలితాలు నిలుపుదల , హాస్టల్ నుండి బహిష్కరణ, అడ్మిషన్ రద్దు వంటివి చేయవచ్చు. ఇంకా ఏదైనా ఇతర సంస్థలో ప్రవేశం నుండి డిబార్ చేయొచ్చని తెలిపింది. వీటిని ఉన్నత విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.
యావజ్జీవ శిక్ష కూడా మార్పు తేకుంటే...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ర్యాగింగ్ అనేది కళాశాలలే కాకుండా విద్యను బోధించే ఏ సంస్థ అయినా, అనాధ శరణాలయం, విద్యార్థి వసతిగృహం, ట్యుటోరియల్ కాలేజీ వంటి విభాగాలన్నీ ఇదే కోవలోకి వస్తాయని. ఇవీ కాక ఈ సంస్థల వెలుపల కూడా అనగా రోడ్లు, బస్సులు ఆగే ప్రాంతం, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వైద్యశాల వంటి ప్రదేశాలన్నింటిలోనూ ర్యాగింగ్ జరపడం నేరం. ఒక విద్యార్థిని ర్యాగింగ్ ద్వారా అవమానించి అతడిని, ఆమెను బాధించడం జరిగితే 6 నెలల వరకు జైలు శిక్ష 1000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ర్యాగింగ్ సందర్భంలో మరణించటం జరిగినా లేదా ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా, నేరస్తునికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50,000 రూపాయల వరకు జరిమానా విధించబడతాయి..
-వెంకటేష్
PDSU రాష్ట్ర నాయకులు
73966 95586