అమరుల స్తూపంలో.. స్వీయ అస్థిత్వం ఎక్కడ!?
In the stupa of Telangana martyrs.. Telangana exists!?
అసామాన్యమైన త్యాగాలను ప్రజలు తమ స్మృతి పదంలో నుంచి తొలగిపోకుండా ఉండేందుకు, ఆ త్యాగాల నుంచి నిరంతరం సంఘటితంగా స్ఫూర్తిని పొందుతూ పురోగమించేందుకు స్మృతి నిర్మాణాలు నిర్మించుకుంటారు. ఇది ప్రాచీన నాగరిక యుగం నుంచి సంస్కృతిగా ఉంది. ఈ స్మృతి వీరుల గురించి ప్రజా సాహిత్యం తన మార్గంలో ఉన్నతీకరిస్తుంది. స్తూప నిర్మాణం కూడా ఇలాంటి పాత్రనే పోషిస్తుంది. ఈ చారిత్రక స్మృతులు ప్రజలను ఏకీకరణ చేస్తాయి. ఇవి రేపటి తరాలు ప్రభావితమయ్యేలా ప్రభోధిస్తాయి. పోరాట రూపాలవుతాయి. పోరాట వేదికలవుతాయి, పోరాట మార్గాలుగా మారుతాయి. ఒక్కోసారి ఆధ్యాత్మికత రూపంలో సజీవ చిహ్నాలుగా ఉంటాయి.
నిర్మాణం చూసి నిర్ఘాంతపోయేలా..
స్వాతంత్రోద్యమ త్యాగాల గుర్తులుగా బిర్సా ముండా చిహ్నాలు, భీమా కోరేగావ్, జలియన్ వాలా బాగ్ లాంటి స్థూపాలు ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈ కోవకు చెందినదే తెలంగాణ అమరుల స్తూపం. నిజానికి 1969 అమరుల స్తూపం తెలంగాణ సమాజంపై మహోన్నతమైన ప్రభావాన్ని చూపించింది. ఈ స్తూపాల నిర్మాణానికి ప్రత్యేకమైన పద్ధతులు, లక్షణాలు అవి వ్యక్తీకరించే ప్రాతిపాదికన ఉంటాయి. అవి క్యారెక్టర్స్ ఆధారంగా ఉండాలని, వాటి నిర్మాణ శాస్త్రాలు(వాస్తు శిల్ప శాస్త్రాలు) కూడా నిశ్చయంగా చెపుతాయి. మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుల కోసం స్మృతి నిర్మాణం నిర్మించడానికి పూనుకున్నప్పుడు తెలంగాణ సమాజమంతా స్వాగతించింది. ఆలస్యం ఐనప్పటికీ అమరుల త్యాగానికి ఒక గుర్తింపును మరియు సచ్చీలమైన గౌరవాన్ని వారికి అర్పించేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యమ శ్రేణులకు అమరవీరుల స్తూప నిర్మాణాన్ని చూసి నిర్ఘాంతపోయే పరిస్థితి వచ్చింది. ఈ నూతన స్తూపం ఒక కాంక్రీట్ నిర్మాణంగా, ఒక శిధిల ఆలోచనగా కాలగర్భంలో కలిసిపోతుందనే భావన ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ప్రముఖ అంతర్జాతీయ శిల్పి అనీష్ కపూర్, చికాగోలో ఒక డ్యాన్స్ థియేటర్ కోసం రూపొందించిన క్లౌడ్ గేట్ అనే నిర్మాణం నుంచి ప్రేరణ పొందడం, తెలంగాణ స్వభావాన్ని ఈ స్తూప నిర్మాణంలో ప్రతిక్షేపించకపోవడం మరొక కారణం. స్మృతి నిర్మాణాలు ఖచ్చితంగా కొన్ని లక్షణాలను పాటించి తీరాలి. క్యారెక్టర్స్ లోపిస్తే దానికి అయ్యే వ్యయంతో పాటు అది చూపించే ప్రభావం కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది.
ఇక్కడి ఆనవాళ్ళు అవసరం లేదా!
స్తూపం కాలానికి అతీతంగా ఉండి, ఏ వాతావరణ పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా ఉండి తీరాలి. అలా ఉండాలంటే నిర్మాణంలో ఉపయోగించే పదార్థాలు అన్ని పరిస్థితులను తట్టుకునేలా ఉండాలి. 1973-74లో గన్ పార్క్ స్తూప నిర్మాణాన్ని అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే పూర్తిస్థాయి గ్రానైట్‌తో రూపొందించారు. కానీ మలిదశ అమరుల స్తూపం నిర్మాణానికి వాడింది ఐరన్, స్టెయిన్ లెస్ స్టీల్, కాంక్రీట్. సహజంగానే వీటికి కాలపరిమితి ఉంటుంది. పైగా హుస్సెన్ సాగర్ సమీపంలోని ఆక్సైడ్ వాతావరణం ఈ నిర్మాణ జీవితాన్ని కరిగించి వేస్తుందనడంలో సందేహం లేదు. ఈ విషయం సర్వ జ్ఞాని అయిన పాలకుడికి, దానిని నిర్మించిన ఆర్కిటెక్ట్‌కు తెలియకుండా ఉంటుందా.!
ఎప్పుడైనా మహత్తరమైన స్మృతి నిర్మాణాలకు ఉపయోగించే పదార్థాలు ఆ ప్రాంతానికి చెందిన వాటితోనే నిర్మించాలి. తెలంగాణలోని రాయిరప్పలు, ప్రజలు పెనవేసుకున్న అనుబంధం ప్రత్యేకమైనది, శాశ్వతమైనది. ఇక్కడి భౌగోళిక పునాది అంతా కఠినమైన గ్రానైట్‌తో నిండి ఉంది. కాబట్టే ఇక్కడి నిర్మాణాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. 1969 అమరవీరుల స్తూపం నల్లటి గ్రానైట్ పునాదిగా ఉండి.. ఆ పైన పది అడుగుల హైదరాబాదీ గ్రానైట్, ఆ పైన ఎర్రటి జహీరాబాద్ గ్రానైట్, ఆ పైన పాల్వంచ తెల్లరాయి పొందుపరచబడింది. అలాగే ఇటీవలే కేంద్రం నిర్మించిన వార్ మెమోరియల్ దానిలోని నేతాజీ శిల్పంతో పాటు నేషనల్ పోలీస్ మెమోరియల్ని కూడా ఖమ్మం గ్రానైట్‌తో రూపొందించారు. రక్షణ శాఖ ఏర్పరుచుకున్న అతి పెద్ద శిల్ప నిర్మాణాలను ఖమ్మం జిల్లా ముదిగొండ నుండి పదహారు వందల కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీకి చేర్చారు. కానీ మలిదశ అమరుల స్తూప నిర్మాణం స్థానిక వనరులతో అనుబంధం లేని వాటితో నిర్మించడం శోచనీయం.
చరిత్ర వ్యక్తీకరణ లేకుండా..
స్మృతి నిర్మాణాలు ఏవైనా చరిత్ర ప్రాముఖ్యతను చెప్పాలి. ఆ త్యాగాలు ఎందుకోసం? ఎవరి కోసం? అని చెప్పడంతో పాటు ఏ విలువల కోసం పోరాటాలు చేసినారో అది వ్యక్తీకరించబడాలి. ఈ లక్షణం 1969 స్తూపంలో మనం చూడవచ్చు. పునాదిలోని నల్ల గ్రానైట్‌పై గల 36 బుల్లెట్ గుర్తులు రాజ్య దమన కాండను చూపించేవిగా ఉంటే.. ఆ పైన సాంచి సూర్యతోరణం త్యాగాలకు దివ్యత్వాన్ని చూపిస్తుండగా., ఆ పైన ఐక్య పోరాటాన్ని సూచించే గ్రానైట్లతో కూడిన ఐక్యత కట్ట, శీర్ష భాగంలోని ఎర్రని రాయిపై గల రాజ్యాంగ ధర్మ చక్రం ఇక్కడి ఉద్యమాన్ని, రాజ్యాంగ విలువల కోసం చేసిన పోరాటంగా చూపిస్తుంది. అంతిమంగా స్తూపం పైన గల స్వచ్చమైన మల్లె మొగ్గ అంజలి ఘటిస్తుంది. ఈ అమరుల స్థూపాన్ని తెలంగాణ సంపూర్ణతను గ్రహించిన వ్యక్తి రూపొందించడం వల్లనే అత్యంత విలువ దీనికి దక్కింది.
కానీ మలిదశ అమరుల స్తూపంలో పోరాట రూపాలను, సారాలను ఎత్తి పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఇందుకోసం ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలనుకున్నారు. దానికి పవిత్రతను చేకూర్చేందుకు శిల్ప లక్షణాలు కూడా లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నారు. ప్రజ్వలించే దీప జ్వాల ఘనీభవించే రూపాన్ని సంతరించుకోవడం అంటే చైతన్యానికి, వాస్తవానికి దూరంగా ఉండడమే అనే అర్థం ఈ ద్వీప స్తూపంలో కనిపిస్తుంది. అమరుల స్తూపం దేనికి నఖల్ కాకూడదు. ఇదే 1969 స్తూపం నిర్మాణంలో పాటించారు. కానీ ప్రస్తుత స్తూపం ఆధునికతను కలిగినప్పటికీ సారాన్ని కోల్పోయింది. ఈ స్తూప డిజైన్ క్లవుడ్ గేట్ అనే వినోద కేంద్రం నుంచి తీసుకోబడింది. అలాగే లండన్‌లోని ఫ్లేమ్ ఆఫ్ ఈక్వాలిటీ గుర్తులు కూడా ఉన్నాయనిపిస్తోంది. మరి ఇందులో తెలంగాణకు ప్రత్యేకతను గౌరవాన్ని ఇచ్చేది ఉన్నట్టా లేనట్టా?
భావోద్వేగాలకు వేదికవుతుందా.!
వాస్తవానికి స్మృతి నిర్మాణాలు శాశ్వతంగా ఉండేవి కాబట్టి నిర్వహణ వ్యయం తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. కానీ 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ స్తూపం నిర్వహణ వ్యయానికి అంతులేకుండా పోతుంది. ఇది కూడా కాళేశ్వరం లాంటి తెల్ల ఏనుగుతో పోల్చదగినది. సచివాలయం లాంటి ఫ్యూడల్ నమూనాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి సుదీర్ఘ కాలం తర్వాత ఒక అమరుల స్థూపాన్ని నిర్మించినప్పటికి దానికి వర్తమానంలోను, భవిష్యత్‌లోను 1969 స్తూపం లాంటి ఎమోషన్స్‌ని ఇస్తుందా అనేది ప్రశ్నార్థకం.!
ఈ స్తూపం తన చెంతకు చేరిన కవి నుంచి కవిత్వాన్ని, ఒక గాయకుడి గుండెలో నుంచి లోతైన గేయాన్ని, చిత్ర శిల్ప కారులకు రంగుల కాన్వాస్, ఓ ఛాయా చిత్రకారుడు అందుకునే చీకటి వెలుగులకు స్ఫూర్తినిస్తుందా.! సందర్శకుడి కనులలో కన్నీటి సముద్రాన్ని సృష్టిస్తుందా.! గుండెలవిసేలా ఉద్విగ్నత జనిస్తుందా.! ఆ ప్రయత్నంగానే యువకుల గొంతుని ప్రతిధ్వనిస్తాయా.! వారి బిగి పిడికిలికి పిడుగు లాంటి బలం చేకూరుతుందా.! లేక ఆకాశం నుంచి రాలిన నీటి బొట్టు స్థూపాన్ని అభిషేకిస్తుందా.! లేక ఘనీభవించిన దీప జ్వాలను ఆర్పివేస్తుందా!
స్వేచ్ఛా ప్రదేశంగా మారుతుందా?
1600 మంది ప్రాణత్యాగాలతో, కోట్లాదిమంది ప్రజల పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో నిర్మించుకొని ఆవిష్కరించుకోబోతున్న అమరుల స్మృతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని స్వీకరించాల్సి ఉండే. కనీసం శిల్పకళ వాస్తు సాహిత్య రంగాలలోని ప్రముఖులతో కమిటీ వేసి సలహాలను తీసుకోవాల్సి ఉండే. 1969 స్తూప సృష్టికర్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్న తెలంగాణ భూమి పుత్రుడు ఎక్కా యాదగిరి రావుని నూతన స్తూప నిర్మాణంలో భాగస్వామ్యం చేయాల్సి ఉండే. గన్ పార్కు స్తూపంలోనే మరొక అద్భుతమైన మరో స్థూపాన్ని నిర్మించి ఉంటే ఒక స్వేచ్ఛ ప్రదేశంగా అమరులను స్మరించుకోవడానికి ఒక స్మృతి వనంగా ఉండేది. కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో ప్రారంభమైన మలిదశ ఉద్యమ సూచిక కేంద్రం ఈరోజు తెలంగాణ స్వభావం మొత్తాన్ని వక్రీకరించే ఒక ఫ్యూడల్ నియంత నిర్బంధంలోకి నెట్టి వేయబడింది. ఈ లోహ కేంద్రంలో ప్రభుత్వాలకి ఇష్టమైన దర్బారి రాగాలకు వంది మాగదులకు వినోదానికి మాత్రమే చోటు దక్కుతుంది. అమరులను స్మరించుకోవడానికి స్వేచ్ఛా వాదులకు, ప్రజాస్వామిక వాదులకు ఉద్యమకారులకు ఈ వేదిక ఏ విధంగా ఉపయోగపడుతుందనే సందేహం తెలంగాణ సమాజంలో లేకపోలేదు.
అంబటి నాగయ్య
తెలంగాణ విద్యావంతుల వేదిక, రాష్ట్ర అధ్యక్షులు
9966989579