దశాబ్దాలుగా 'కత్తి' యుద్ధ ప్రయాణం!

దళిత దర్శనమే తన కట్టెలమోపుగా చేసుకుని బ్రాహ్మణ వాద మూలాలను పెకలించి కులం, మతం దోపిడీని ప్రశ్నించి దళిత జీవన పరిశోధకునిగా

Update: 2024-08-03 00:45 GMT

దళిత దర్శనమే తన కట్టెలమోపుగా చేసుకుని బ్రాహ్మణ వాద మూలాలను పెకలించి కులం, మతం దోపిడీని ప్రశ్నించి దళిత జీవన పరిశోధకునిగా ఆధునిక భారతదేశ చరిత్రకు అంబేద్కర్‌ చూపు ఒక్కటే సత్యమని చాటుతూ, తానో తిరుగుబాటుగా ఈ యుగం మాదేనంటూ బహుజన దర్శనంగా, ఉద్యమ నిర్మాతగా, పత్రికా సంపాదకునిగా, మహాకవిగా, గొప్ప రచయితగా, విమర్శకునిగా, మహావక్తగా నీతి, నిజాయితీ, నిబద్ధతకు, వ్యక్తిత్వ నిర్మాణ దక్షతకు చిరునామాగా నిలిచిన ‘ఒక అస్పృశ్యుని యుద్ధ గాథ’ డా. కత్తి పద్మారావు.

అవి మట్టిని మహాకావ్యంగా మలచిన చేతులు. మట్టిని మాతృమూర్తిగా ప్రేమించిన వాడు. ఈ మట్టికి కులమేంటని ప్రశ్నించిన గొంతుక. మట్టికి అంటరాని తనమేమిటని పోరాడిన అక్షర యోధుడతడు. ఈ దేశం మాదని నినదించే ఈ దేశ మూలవాసీ. ప్రతిభ, సంపద కొందరిది కాదు అది శ్రమ చేతుల చెమట పూలది అని భూమి భాషపై ప్రతిధ్వనించిన వాడు. నా అక్షరాలు మట్టి మనుషుల అంతరంగా లని, అవి ఆకాశ పక్షులై ప్రకృతి నిండా విస్తరిస్తాయని జనగీతంగా మొదలైనవాడు. అవమానాలతో కూడిన అనేక ఆటుపోట్లను, వివక్షను ముళ్ల కిరీటంగా ధరించి ఈ దేశంలో భూమి నరనరాల్లో చొచ్చుకు పోయిన కులం పునాదుల్ని తవ్వి జాతి ఆత్మగౌరవ స్వరమై విముక్తి గీతం ఆలపించిన వాడు. చార్వాక దర్శనంతో హేతువాద సత్యాన్వేషణ నుండి బౌద్ధ, అంబేద్కర్‌, పూలే, పెరియార్‌ భావజాల వెలుగులో ప్రత్యామ్నాయ సంస్కృతిని నీలికేకగా అందించిన నల్ల కలువ అతడు.

దళిత ఉద్యమ తాత్విక పునాది!

1980వ దశకంలో ఆంధ్రదేశంలో సామాజిక, రాజ కీయ, సాంస్కృతిక, తాత్విక స్తబ్దతను బద్దలు కొట్టే ప్రత్యామ్నాయ దళిత ఉద్యమానికి అంబేద్కర్‌ తర్వా త పునాది వేసి యాభై ఏళ్లుగా భారతదేశంలోనే అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఏకైక దళిత ఉద్యమ నిర్మాత కత్తి పద్మారావు. ఎన్నో అణచివేతలను అధిగమిస్తూ ఆత్మగౌరవ పోరాటం చేస్తున్న యుద్ధ వీరుడు. మనువాద విషసంస్కృతి వికృత రూపాన్ని, బ్రాహ్మణీయ భావజాల ఆధిపత్యాహంకార అగ్రకుల దాష్టీకాన్ని, ఆ అగ్రకుల ఆధిపత్య రాజ్య స్వభావాన్ని, అణచివేయడానికి ప్రాణాలను సైతం లెక్కచేయక వేలాది మంది స్త్రీలను, పురుషులని ఉద్యమకా రులుగా తీర్చిదిద్ది మరో స్వాతంత్య్ర పోరాటంగా 1985 కారంచేడు ఉద్యమాన్ని జాతీయ, అంతర్జాతీయ దళిత ఉద్యమంగా 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్‌ యాక్ట్‌ ఆఫ్‌ అట్రాసిటీని భారతదేశ దళితులకు హక్కుగా అందించింది కత్తి పద్మారావే.

ప్రపంచ సాహిత్య అధ్యయన వేత్త!

భారతదేశంలోని అసమానతలకు, అణచివేతకు, అంటరాని తనానికి, దోపిడీ, దౌర్జాన్యాలకు, అత్యాచారాలకు, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడటమే జీవితంగా దళిత బహుజనుల పక్షం వహించి ఇంతగా అధ్యయనం, పరిశోధన, రచన, ముద్రణ, పత్రికా సంపాదకత్వం, ఉద్యమం, ఇలా బహుముఖీనమైన కృషి చేస్తూ వస్తున్నారు ఈయన.. అంబేద్కర్‌ సిద్ధాంత భూమికతో ప్రపంచ మేధావులు సోక్రటీస్‌, ప్లేటో, అరిస్టాటిల్‌, కాంట్‌, హెగె‌ల్‌, మార్క్స్‌ ఇంకా అనేక మంది రచనలను ప్రా‌చీన సాహితీ వేత్తలను, ఆధునిక సాహిత్యం, రాజకీ‌య సిద్ధాంతకారులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా దళితుల చరిత్ర, సంస్కృతి, ఆర్థిక, సామాజిక, రాజకీయ సిద్ధాంతంపై ఏ విశ్వవిద్యాలయాలు కూడా చేయలేని గొప్ప రచనల్ని అందించిన గొప్పమేధావి, సామాజిక శాస్త్రవేత్త కత్తి పద్మారావు అనడానికి వారు భారతీయ సమాజానికి ఇప్పటివరకు అందించిన 80 రచనలే సాక్ష్యం. మరో 10 గ్రంధాలు అచ్చులో ఉన్నాయి. 2024 నాటికి 100 గ్రంధాలు పూరిచేయాలనే సంకల్పం తో కరోనా కాలంలో కూడా 18 గంటలు తన రచనా వ్యాసంగానికి వారి సమయాన్ని కేటాయించారు. వీరి ప్రతి రచనా గొప్పదే. ప్రతి రచనా మూడు, నాలుగు ముద్రణలు పొందినవే.

అంతర్జాతీయ సెమినార్లు, ఉపన్యాసాలు..

ఈయన భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో నూ, ప్రజా సమూహాల మధ్య వేలాది ఉపన్యాసాలు, గౌరవోపన్యాసాలు ఇచ్చారు. అంతేగాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 1998లో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన మొట్టమొదటి దళిత మహాసభలో, 1999లో లండన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోనూ, 2020 దక్షిణాఫ్రికా దర్బన్‌లో జరిగిన ప్రపంచ మానవ హక్కుల సమావేశంలో పాల్గొని దళితులపై దోపిడీ, అణచివేత, అంటరానితనాలపై పరిశోధనా పత్రాలు డాక్యుమెం ట్లు సమర్పించారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. అంబేద్కర్‌ తన జీవితకాలంలో లక్ష పేజీల రచనా వ్యాసంగం కొనసాగిస్తే పద్మారావు లక్షన్నర పేజీల రచనా వ్యాసంగాన్ని పూర్తి చేశారు. ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. అంబేద్కర్‌ 30 వేల గ్రంథాలతో తన వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేస్తే, ఈయన 65 వేల గ్రంథాలతో ఏర్పాటు చేసి రాబోయే తరాలకు దాన్ని ఓ రీసెర్చ్‌ సెంటర్‌గా రూపొందించారు. అం బేద్కర్‌ మిళింద విశ్వవిద్యాలయాన్ని రూపొందిస్తే ఈయన లుంబినీ వనం పొన్నూరులో అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం (సబాల్ట్రన్‌ స్టడీస్‌) ఏర్పాటు చేశారు.

తన జీవితమే సామాజిక చరిత్రగా..

దేశంలోనే అగ్రకుల రచనల కంటే ఎన్నో అత్యుత్తమ రచనల్ని అత్యంత శక్తివంతంగా అందించిన మహా కవి డా.కత్తి పద్మారావు. వీరు జైల్లో ఉరిశిక్ష ఖైదీల సెల్లో లాఠీ దెబ్బలు తినడమే కాదు కుటుంబం మొత్తం పస్తులతో అనేక ఆటుపోట్లకు గురైనా మొక్కవోని ధైర్యంతో పోరాట యోధునిగా నిలబడి తన జీవిత చరిత్రని సామాజిక చరిత్రగా అందించిన సాహస యోధుడు. వీరి సమస్త జీవితంలో అటు ఉద్యమ జీవితంలో, సాహిత్య రచనా వ్యాసంగంలో వీరి సహచరి కత్తి స్వర్ణ కుమారి గారి పాత్ర ప్రముఖమైనది.

ఇది అస్పృశ్యుని యుద్ధగాథ

కత్తి పద్మారావు వందలాది గ్రంధాలు చదివిన మేధావి. దళిత ఉద్యమానికే అమ్మ. గొప్ప దళిత తల్లి. అస్పృ శ్యుని యుద్ధ గాథ నాలుగు భాగాలు ప్రపంచ సాహిత్య చరిత్రలో అత్యుత్తమ సామాజిక చరిత్ర రచనగా మేధావులు, సాహితీ వేత్తలు, ప్రొఫెసర్లు కొనియాడారు. ఇది ఇంగ్లీష్‌ అనువాదంగా కూడా రాబోతుంది. అంతర్జాతీయ చలన చిత్రంగా కూడా త్వరలో ఈ అస్పృశ్యుని యుద్ధగాథ రాబోతోంది. నెత్తురు, కన్నీళ్లు కలగలసిన మట్టి మనుషుల పోరాట చరిత్ర, సామాజిక చరిత్ర అని పలు దేశాల సాహితీవేత్తల ప్రశంసలు అందుకుందీ రచన. వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన 100 మంది యువ రీసెర్చ్‌ స్కాలర్లతో, 100 మంది డాక్టరేట్లతో ప్రపంచ చరిత్రలో ఎవరూ చేయని ఒక గొప్ప బృహత్‌ ప్రణాళికతో అంబేద్కర్‌ విశ్వ విద్యాలయం రూపొందించడం ఒక చారిత్రక సందర్భం.

-శిఖా ఆకాష్‌,

అరసం ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా

93815 22247

Tags:    

Similar News