అంతరించిన జీవాలకు మళ్లీ ప్రాణం?
మానవాళి అభివృద్ధి పేరుతో మూగజీవాలకు ప్రమాదం వాటిల్లుతోంది. ఇప్పటికే చాలా జంతువులను ఫొటోల్లో చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆహారం కోసం, అమ్ముకోవడానికి వేట వల్ల ఒక్కరోజులో 30 నుంచి 50 వరకు జాతులు అంతరించిపోతున్నాయి. 1500 సంవత్సరం నుంచి 300 రకాలకు పైగా క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు ఎన్నో అంతరించిపోయాయి. ఈ జంతువులన్నీ పర్యావరణాన్ని సమతుల్యపరచడంలో ఏదో రకంగా సహాయపడేవి. ఇప్పుడు మారుతున్న పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జెనెటిక్ ఇంజినీరింగ్ సాయంతో అంతరించిన జాతుల్లో […]
మానవాళి అభివృద్ధి పేరుతో మూగజీవాలకు ప్రమాదం వాటిల్లుతోంది. ఇప్పటికే చాలా జంతువులను ఫొటోల్లో చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆహారం కోసం, అమ్ముకోవడానికి వేట వల్ల ఒక్కరోజులో 30 నుంచి 50 వరకు జాతులు అంతరించిపోతున్నాయి. 1500 సంవత్సరం నుంచి 300 రకాలకు పైగా క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు ఎన్నో అంతరించిపోయాయి. ఈ జంతువులన్నీ పర్యావరణాన్ని సమతుల్యపరచడంలో ఏదో రకంగా సహాయపడేవి. ఇప్పుడు మారుతున్న పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జెనెటిక్ ఇంజినీరింగ్ సాయంతో అంతరించిన జాతుల్లో కొన్ని ముఖ్యమైన జంతువులకు ప్రాణం పోయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. సీఆర్‌ఐఎస్‌పీఆర్-క్యాస్9 అనే విప్లవాత్మక జన్యుసంబంధ సాంకేతికత సాయంతో శాంటా బార్బరాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఈ పని చేయనున్నారు. ఇందుకోసం జూలుతో ఉండే పెద్ద ఏనుగును, ప్యాసెంజర్ పావురాన్ని ముందుగా పునఃసృష్టి చేయాలని ప్రతిపాదించుకున్నారు. పర్యావరణానికి ఇవి అందించే ప్రాముఖ్యత ఆధారంగా అనేక విశ్లేషణల తర్వాత ఈ రెండు జీవులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇలా పునఃసృష్టి చేసేది జంతువులను జూలో పెట్టి ప్రదర్శన కోసం కాదని, వాటి ద్వారా పర్యావరణహిత ప్రయోజనాలు పొందడం కోసం అడవుల్లో వదిలేయడానికి మాత్రమేనని ఎకాలజిస్ట్ బెన్ నోవాక్ అంటున్నారు. అలాగే ఈ రెండు జంతువులను ఎంపికచేయడానికి గల ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. జూలుతో ఉండే పెద్ద ఏనుగులు ఆర్కిటిక్ జీవావరణాన్ని సమతుల్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాయని అన్నారు. శాకాహారులైన ఈ ఏనుగులు ఆహారవేటలో భాగంగా పెద్ద పెద్ద చెట్లను గుద్దుకుని విరిగిపోయేలా చేసి అక్కడి భూమిని సేద్యానికి వీలుగా చేసేవని, అలాగే ఆ ప్రాంతాల్లో దట్టమైన అడవులు కాకుండా పచ్చిక బయళ్లు ఏర్పడేందుకు దోహదపడేవని చెప్పారు. ఇప్పుడు ఆ ఏనుగులు లేకపోవడం వల్ల దట్టమైన టండ్రా, టైగా భూములు ఏర్పడి కార్బన్ డైఆక్సైడ్ విడుదలకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. అలాగే ప్యాసెంజర్ పావురాల గురించి కూడా ఆయన క్లుప్తమైన వివరణనిచ్చారు. మండే స్వభావం గల రెట్టను వేసే ఈ పావురాల కారణంగా దట్టంగా పెరిగిన అడవుల్లో కార్చిచ్చులు రగిలి, పాత చెట్లు కాలిపోయి కొత్త చెట్టు పుట్టేందుకు ఆస్కారం ఉండేదని, అంతేకాకుండా రెట్టల ద్వారా ఇవి విత్తనాలను కూడా వివిధ ప్రాంతాల్లో చల్లేవని చెప్పారు. ఈ రెండు జీవజాతులు అంతరించి పోయాక ఆయా జీవావరణాల్లో సమూల మార్పులు సంభవించాయని, అందుకే వాటిని ముందుగా పునఃసృష్టి చేయాలని నిర్ణయించుకున్నట్లు బెన్ తెలిపారు.
పునఃసృష్టి ఎలా చేస్తారు?
అంతరించిపోయిన జంతువును మళ్లీ సృష్టించడం సులభమైన పనేం కాదు. కానీ మూడు ముఖ్యమైన పద్ధతుల ద్వారా శాస్త్రవేత్తలు ఈ పునఃసృష్టి ప్రయోగాన్ని సఫలీకృతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మొదటగా బ్యాక్ బ్రీడింగ్ విధానాన్ని ఎంచుకోనున్నారు. ఇందులో ఆయా అంతరించిన జంతువులకు దగ్గరి లక్షణాలున్న జంతువుల మధ్య మేటింగ్ సాధ్యపడేలా చేసి వాటిని తిరిగి పుట్టిస్తారు. అయితే ఇది పూర్తిగా పునఃసృష్టి చేసినట్లు కాదు. కానీ ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తే, ఆ కొత్తగా పుట్టిన జీవుల జన్యువును మరికొన్ని మార్పులు చేయడం ద్వారా పునఃసృష్టి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇక రెండో విధానంలో క్లోనింగ్ చేస్తారు. క్లోనింగ్ ప్రక్రియ గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసు. అయితే అంతరించి పోయిన జంతువుల మూలకణాలను సంపాదించి కేంద్రకాన్ని ఐసోలేట్ చేయడమే ఇక్కడ ప్రధాన సమస్యగా మారనుంది. ఆ జీవుల మూలకణాల కోసం చాలా తవ్వకాలు జరిపి, చరిత్ర లోతులను పరిశీలించాల్సి వస్తుంది. ఇక మూడో విధానం జెనెటిక్ ఇంజినీరింగ్. ఇప్పటికే ఈ విషయంలో చాలా పురోగతి సాధించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించి పోయిన జాతులకు దగ్గరి సంబంధం ఉన్న జంతువుల డీఎన్‌ఏలో కొన్ని మార్పులు చేసి, కావాల్సిన లక్షణాలను మాన్యువల్‌గా జొప్పించి జంతువులను పునఃసృష్టి చేయాల్సి ఉంటుంది.
మూడో విధానం వికటిస్తే?
హాలీవుడ్ సినిమా జురాసిక్ పార్క్‌లో చూపినట్లుగా జెనెటిక్ ఇంజినీరింగ్ ప్రయోగాలు వికటించి అనుకున్న లక్షణాలతో పాటు కొత్త లక్షణాలు కూడా వస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని ఈ పునఃసృష్టి ప్రక్రియను విమర్శిస్తున్న వాళ్లంటున్నారు. అయితే జంతువులను సృష్టించేటపుడే వాటిని కట్టడి చేయగల నియంత్రణ విధానాలను కూడా అభివృద్ధి చేయాలని సలహా ఇస్తున్నారు. వాటి విపరీత ప్రవర్తనను ఇప్పటికే జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా సృష్టించిన మొక్కలను ఉదాహరణగా చూపుతున్నారు. జన్యుమార్పిడి చేసిన వంగడాల వల్ల దిగుబడి పెరిగి రైతులకు లాభం కలిగినప్పటికీ సహజంగా అందులో ఉండే పోషకాలు నశించిపోయి కొత్త హానికర పదార్థాలు అభివృద్ధి చెందాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పునఃసృష్టి ప్రక్రియను మొదలుపెట్టాలని వారు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో సాంకేతికతను ఉపయోగించి లాభాలు పొందడం కంటే, ఆ ప్రకృతిని కాపాడటానికి మానవ ప్రయత్నం చేస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.