నిద్దరోతున్న నిఘా నేత్రాలు.. పోలీసులపై వెల్లువెత్తుతోన్న విమర్శలు
దిశ, ఓదెల: ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని ఏకంగా పోలీసులే చెబుతుండటం మనం చూస్తుంటాం. అసాంఘిక కార్యకలాపాలు, అరాచకాలను అడ్డుకట్టు వేయడానికి.. దొంగతనాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఛేదించడానికి ఎంతగానో ఉపయోగపడే సీసీ కెమెరాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరించి పోలీసులే వేలాది రూపాయలు వ్యాపారస్తులు, ఇతర వర్గాల వద్ద డబ్బులు జమ చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, రోడ్లమీద ఏర్పాటు చేసి వాటి నిర్వహణ […]
దిశ, ఓదెల: ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని ఏకంగా పోలీసులే చెబుతుండటం మనం చూస్తుంటాం. అసాంఘిక కార్యకలాపాలు, అరాచకాలను అడ్డుకట్టు వేయడానికి.. దొంగతనాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఛేదించడానికి ఎంతగానో ఉపయోగపడే సీసీ కెమెరాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరించి పోలీసులే వేలాది రూపాయలు వ్యాపారస్తులు, ఇతర వర్గాల వద్ద డబ్బులు జమ చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, రోడ్లమీద ఏర్పాటు చేసి వాటి నిర్వహణ గాలికొదిలేశారు.
దీంతో సీసీ కెమెరాలు ఎందుకూ పనిచేయకుండా పోతున్నాయి. పోలీస్ అధికారులు నూతనంగా పోస్టింగ్ చేపట్టిన వెంటనే గ్రామాల్లో సీసీ కెమెరాల ఆవశ్యకతను చెబుతూ ప్రజల సహకారంతో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పెట్టిన కొంతకాలం బాగానే ఉన్నా.. అవి పాడైతే పట్టించుకునే నాథుడే కడువయ్యాడు. దీంతో ఓదెల మండలంలోని అనేక గ్రామాల్లో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఇటీవల ఓదెల మండల కేంద్రంలో ఇద్దరు వృద్ధ మహిళపై అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు దాడిచేసి బంగారం ఎత్తుకెళ్లారు.
ఘటనా స్థలిలో సీసీ కెమెరాలు ఉన్నా.. అవి పనిచేయకపోవడంతో కేసును ఛేదించడం పోలీసులకు కష్టతరంగా మారింది. అలాగే, గోపరపల్లి గ్రామంలో పట్టపగలు ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లిన కేసు కూడా మిస్టరీగానే ఉంది. ఎత్తుకెళ్లిన బంగారం దొరికినా, చోరీకి పాల్పడింది ఎవరనేది తేలలేదు. కొలనూర్, హరిపురం, రూపు నారాయణపేట, కనగర్తి, మడక, పోతకపల్లి ఇలా అనేక గ్రామాల్లో సీసీ కెమెరాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. ప్రజలు ముందుకొచ్చి సీసీల ఏర్పాటులో భాగస్వాములైనా పోలీసుల నిర్వహణ లోపంతో పనిచేయకుండా పోయాయి. దీంతో పోలీసులు సీసీ కెమెరాల నిర్వహణపై దృష్టిపెట్టి గ్రామాల్లో నిరుపయోగంగా పడివున్న కెమెరాలను వినియోగంలోకి తీసుకురావాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.