కరెంట్ షాక్ తో కార్మికుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
కరెంట్ షాక్ తో విద్యుత్ కార్మికుడు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

దిశ, శేరిలింగంపల్లి : కరెంట్ షాక్ తో విద్యుత్ కార్మికుడు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన రామకృష్ణ (35) కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రఘుబాబు అనే కాంట్రాక్టర్ ద్వారా కరెంటు స్తంభాలు ఎత్తడం, విద్యుత్ లైన్ వైర్లు లాగడం పనిలో చేరాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లిన రామకృష్ణ తోటి కార్మికులతో కలిసి పనిచేస్తున్న క్రమంలో విద్యుత్ సబ్ స్టేషన్ నుండి అనుమతి తీసుకోకుండా పనులు కొనసాగించడంతో స్తంభం ఎత్తే క్రమంలో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈ ఘటనలో రామకృష్ణ కరెంట్ షాక్ తో మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి ప్రస్తుతం కొండాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయంలో ఎలక్ట్రిసిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.