బతుకమ్మ వేడుకల్లో విషాదం....చెరువులో నిమజ్జనం చేస్తుండగా...వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు.

Update: 2024-10-11 09:12 GMT

దిశ, సదాశివపేట : సంగారెడ్డి జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. స్థానికులు అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. వివరాల్లోకి వెళ్తే... జిల్లాలోని సదాశివపేట మండలంలోని మెలిగిరి పేటలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. గురువారం స్థానికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. ఆట,పాటల అనంతరం అంతా కలిసి ఊరేగింపుగా చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తున్న సమయంలో పెద్దగొల్ల రాములు (33)అనే స్థానిక వ్యక్తి కాలు జారి అందులో పడిపోయాడు. అక్కడే ఉన్న కొంతమంది వెంటనే అతన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను మృతి చెందాడని వైద్యులు గుర్తించారు. పండగపూట సంతోషంగా గడుపుతున్న సమయంలో అనుకోని ఈ ఘటన రాములు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది. మృతుడి తండ్రి పెద్ద గొల్ల బక్కయ్య ఫిర్యాదు మేరకు సదాశివపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Similar News