ఆలూర్ లో దొంగల బీభత్సం
ఆలూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం దొంగలు బీభత్సం సృష్టించారు.
ఎనమిది తులాల బంగారం, రూ.25 వేల నగదు చోరీ
దిశ, ఆర్మూర్ : ఆలూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కత్తుల చిన్న గంగాధర్, సత్యగంగు దంపతులు గురువారం రాత్రి ఇంట్లో ఉక్కపోతతో ఇంటికి తాళం వేసి డాబా మీద పడుకున్నారు. ఈ క్రమంలోనే ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో బీరువాను తెరచి అందులో ఉన్న ఎనమిది తులాల బంగారం, రూ.25 వేల నగదు, కుమారుడి పాస్ పోర్ట్, ప్రామిసరీ నోట్, బ్యాంక్ పాస్ బుక్ లు, పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ బుక్ చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో దొంగతనం జరిగి ఉండవచ్చని బాధితులు కత్తుల చిన్న గంగాధర్- సత్యగంగు దంపతులు తెలిపారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరాం తెలిపారు.