అనుమానంతో భార్యను కాలువలోకి నెట్టి హత్య చేసిన భర్త
భార్యపై అనుమానంతో కాలువలోకి నెట్టి భార్యను హత్య చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టు రిమాండ్ చేశారు.
దిశ,మిర్యాలగూడ: భార్యపై అనుమానంతో కాలువలోకి నెట్టి భార్యను హత్య చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టు రిమాండ్ చేశారు. మిర్యాలగూడ డి.ఎస్.పి కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం రావు వారి గూడెం గ్రామానికి చెందిన పేర బోయిన సైదులు మిర్యాలగూడ పట్టణానికి చెందిన కుమ్మరి అనూష గత 16 సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. కాగా గత కొంతకాలంగా ఇరువురి మధ్య విభేదాలు రావడంతో భార్యను వేధిస్తుండేవాడు.
ఇందులో భాగంగా అనూష రావు వారి గూడెం అంగన్వాడీ టీచర్‌గా బాధ్యత నిర్వహిస్తూ మండలంలోని కామేపల్లి అంగన్వాడి సెంటర్‌కు ఇంచార్జిగా పనిచేస్తున్నారు. కాగా ఈ నెల 5న సైదులు భార్య అనుషను బైక్ పైకి తీసుకెళ్లి అంగన్వాడి సెంటర్‌లో దించి వచ్చారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై తీసుకువస్తూ ఆమెను చంపాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం రావులపెంట సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు రాగానే ఆమె పై చేయి చేసుకుని ఆమెను బలవంతంగా కాల్వలోకి నెట్టివేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ద్విచక్ర వాహనాన్ని కాలువలోకి నెట్టడంతో పాటు తాను కాలువలోకి దిగి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు.
కాగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపాలని ఉద్దేశంతో కాలువలోకి నెట్టినట్లు నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. కాగా మృతదేహం గరిడేపల్లి మండలం పొనుగోడు రిజర్వాయర్ లో లభించినట్లు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు మృతురాలి తల్లి ఫిర్యాదు చేసింది. మెదక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకి రిమాండ్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. కేసులో పురోగతి సాధించిన రూరల్ సీఐ వీరబాబు, వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు, మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్యను డీఎస్పీ అభినందించారు.