రైళ్లలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్..

రైళ్లలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడితో పాటు

Update: 2024-11-05 16:29 GMT

దిశ,సికింద్రాబాద్: రైళ్లలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడితో పాటు ముగ్గురు సభ్యుల ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే 131 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే అర్బన్ డీ ఎస్ పీ జావేద్, ఇన్ స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తో కలిసి మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురిపిరాల గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న(38), ఓర్సు నవీన్(25), ఓర్సు అశోక్(30) ఉపాధి కోసం నగరానికి వచ్చి దమ్మాయిగూడ,చక్రిపురం లో నివాసం ఉంటూ భవన నిర్మాణ కూలీలుగా పనులు చేస్తున్నారు. బంధువులు అయిన వీరు మద్యానికి అలవాటు పడ్డారు.

అయితే వీరు చేసే కూలి పనులతో వచ్చే డబ్బులు సరిపోక పోవడం తో సెల్ ఫోన్ చోరీలు చేయాలి ప్లాన్ వేసుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగా సెల్ ఫోన్లు చోరీ చేసి విక్రయించగా తక్కువ డబ్బులు రావడం, అవి వారి జల్సాలకు సరిపోక పోవడం లేదు. అదే కాకుండా సెల్ ఫోన్లు చోరీ చేస్తే చాలా సులువుగా పోలీసులకు దొరికిపోతామని భావించిన వీరు రైళ్లలో చైన్ స్నాచింగ్ తో ఎక్కువ డబ్బులు సంపాదించే వచ్చని ప్లాన్ వేసుకున్నారు. నలుగురు కలిసి రైళ్లలో చైన్ స్నాచింగ్ మొదలు పెట్టారు. రైళ్లలో ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలు కొట్టేసి వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు ..బాధిత ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు వారిపై నిఘా పెట్టారు.

ఈ క్రమంలో మంగళవారం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు .నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ .10 లక్షల విలువైన 131 గ్రాముల బంగారు ఆభరణాలు ,మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలుడిని జువెనైల్ హోం కు తరలించిన పోలీసులు మిగతా ముగ్గురు నిందితులను రైల్వే కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ జావేద్ తెలిపారు .కాగా వీరి పై సికింద్రాబాద్,నల్గొండ రైల్వే పోలీస్ స్టేషన్ ల పరిధిలో 7 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News