తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

సిరిసిల్ల - వేములవాడ ప్రధాన రహదారిలోని అయ్యప్ప ఆలయం ముందు బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2025-01-01 04:39 GMT

దిశ, వేములవాడ టౌన్ : సిరిసిల్ల - వేములవాడ ప్రధాన రహదారిలోని అయ్యప్ప ఆలయం ముందు బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదుకు చెందిన సాంబయ్య అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజన్న దర్శనానికి కారులో వస్తుండగా కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి అతివేగంగా వచ్చి ముందున్న కారును బలంగా ఢీ కొట్టింది.

దీంతో కారు పక్కనే ఉన్న డివైడర్ను ఢీ కొట్టి ఆగిపోయి ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని, ఒకవేళ కారు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొని ఆగి ఉండకపోతే ముందున్న కల్వర్టులో పడేదని, ఇదే జరిగి ఉంటే ప్రమాద స్థాయి ఊహించని రీతిలో ఉండేదని, తృటిలో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


Similar News