రాచకొండ ఏహెచ్‌టీయూ పోలీసుల డెకాయ్ ఆపరేషన్.. పట్టుబడిన లేడీ కిలాడీ..
హలో అమ్మాయి కావాలి. ఎంత రేటు. అమ్మాయిల ఫోటోలు పంపండి

దిశ,చైతన్యపురి : హలో అమ్మాయి కావాలి. ఎంత రేటు. అమ్మాయిల ఫోటోలు పంపండి చూసి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే అలాగే సార్ మీకు నచ్చిన అమ్మాయిని ఫోటోలు పంపిస్తాను. చూసి చెబితే పంపిస్తాను రేటు మీరు మాట్లాడుకోండి ఓకే నా.. ఓకే..సినిమా అవకాశాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయక యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తున్న కిలాడీ లేడిని రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ద్వారా వలపన్ని పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా దర్శి కి చెందిన నాగమణి భర్త లేడు. తన కూతురుకు వివాహం చేసింది. కుమారుడితో కలిసి అమీర్ పేట్ కృష్ణానగర్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. నాగమణి అమాయక యువతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, భర్తల చేతిలో మోసపోయి ఒంటరిగా జీవిస్తున్న వారిని టార్గెట్ చేసుకుని వారిని చేరదీస్తుంది.
ఉద్యోగాలు ఇప్పిస్తానని, సినిమాలో అవకాశాలు కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఒప్పించి చివరకు వ్యభిచార వృత్తిలోకి దించుతుంది. ఆర్థిక అవసరాలు బలహీనంగా మారడం తో యువతులు నాగమణి చెప్పినట్లుగా చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు నిఘా పెట్టి నాగమణి కి ఫోన్ వాట్సాప్ ద్వారా అమ్మాయి కావాలని సమాచారం ఇచ్చారు. అందుకు ఆమె ఒప్పుకుని వాట్సాప్ ద్వారానే అమ్మాయి ఫోటోలు పంపింది. ఫోన్ ద్వారానే బేరం కుదుర్చుకుని అమ్మాయిలను సప్లై చేస్తుంది. సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డి, ఏ హెచ్ టీ యూ ఇన్స్ పెక్టర్ దేవేందర్, ఎస్సైలు రాములు నాయక్, వెంకట శ్రీను బృందం ఆధ్వర్యంలో డెకాయి ఆపరేషన్ చేశారు. మొదటగా ఆదిబట్లలో ఉన్నానని, తర్వాత కొత్తపేటలో, తర్వాత డీసీబీ బ్యాంక్ వద్ద, తర్వాత కమలానగర్ పాణినీయ కళాశాల వద్దకు రావాలని నాగమణి సూచించింది. మాటు వేసిన పోలీసులు నాగమణి ని అదుపులోకి తీసుకుని విచారించారు. కేవలం తాను అమ్మాయిలను సరఫరా చేస్తానని నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బేరం మాట్లాడుకుంటారని తెలిపింది. పని పూర్తయిన తర్వాత తనకు కమిషన్ ఇస్తారని పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం సరూర్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.