భార్యను హింసించిన భర్తకు ఏడాది జైలు

మూడుముళ్ల బంధంతో ఏకమై తనను నమ్మి వచ్చిన భార్యను నిర్లక్ష్యం చేయడంతో పాటు రెండో పెళ్లి కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించిన భర్తకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.

Update: 2024-11-07 12:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మూడుముళ్ల బంధంతో ఏకమై తనను నమ్మి వచ్చిన భార్యను నిర్లక్ష్యం చేయడంతో పాటు రెండో పెళ్లి కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించిన భర్తకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. నవీపేట్ పోలీసుల తరుపున ప్రాసిక్యూషన్ నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ కు చెందిన ర్యాపని దేవదాస్ కు నవీపేట్ కు చెందిన రేఖకు పెళ్లి జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా శ్రావణ్, శ్రావ్య అనే ఇద్దరు పిల్లలు కలిగారు. తరువాత క్రమంలో దేవదాసుకు ఒక మహిళతో లైంగిక సంబంధం ఏర్పడింది.

     ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని భార్య రేఖకు చెప్పడంతో ఆమె తిరస్కరించింది. దీంతో తాను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానంటూ దేవదాసు తన భార్య రేఖతో గొడవ పడుతూ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. భర్త హింసలు తట్టుకోలేక భర్తపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దేవదాసును రిమాండ్ కు తరలించారు. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టి దేవదాసుపై నేరం రుజువు కావడంతో సంవత్సరం జైలుశిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వి. హరి కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని మేజిస్ట్రేట్ తీర్పులో పేర్కొన్నారు. 


Similar News