ఫీజు ఎక్కువ అడిగాడని డాక్టర్‌ని కాల్చి చంపిన మైనర్

Update: 2024-10-04 17:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫీజు ఎక్కువగా అడిగాడనే కోపంతో ముగ్గురు మైనర్లు ఏకంగా ఓ డాక్టర్‌ని హతమార్చిన దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలోని ఓ నర్సింగ్ హోమ్‌కి సెప్టెంబర్ 20 అర్థ రాత్రి సమయంలో గాయంతో ఉన్న ఓ బాలుడు వచ్చాడు. ఆ బాలుడికి చికిత్స చేసిన డాక్టర్ అక్తర్ ఫీజుగా రూ.1200 ఇవ్వాలని అడిగాడు. కానీ ఆ కుర్రాడు.. చిన్న దెబ్బకే అంత ఫీజు ఎందుకివ్వాలని గొడవపడి.. చివరికి రూ.400 ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత కట్టు విప్పించుకునేందుకు తన అత్తతో కలిసి మళ్లీ ఆ బాలుడు ఆసుపత్రికి వచ్చాడు. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం చికిత్స చేసేందుకు నిరాకరించారు. అంతేకాకుండా డాక్టర్ అక్తర్ అతడిని మందలించి పంపించేశాడు.

దీంతో డాక్టర్‌పై కక్ష పెంచుకున్న కుర్రాడు.. డాక్టర్ అక్తర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఇద్దరు స్నేహితుల సహాయం తీసుకున్నాడు. మొత్తానికి ఒక తుపాకీని సంపాదించి ముగ్గురూ ఆస్పత్రికి వచ్చారు. గాయానికి డ్రెస్సింగ్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ నిరాకరించడంతో నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో అక్తర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్ అవమానించడంతోనే వైద్యుడిని చంపినట్లు మైనర్ నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. 


Similar News