వైద్యం వికటించి బాలింత మృతి

వైద్యం వికటించి బాలింత మృతి చెందిన సంఘటన సత్తుపల్లి లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-11-27 14:03 GMT

దిశ,సత్తుపల్లి : వైద్యం వికటించి బాలింత మృతి చెందిన సంఘటన సత్తుపల్లి లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామానికి చెందిన పిల్లి స్నేహలత (25) నిండు గర్భిణి కావటంతో ప్రసవం నిమిత్తం గత శుక్రవారం సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మరుసటి రోజు ఆపరేషన్ చేయగా బాబుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ సమయంలో మత్తు ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకోగా మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సిఫార్సు చేశారు.

    వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహలతను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా బుధవారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. దాంతో సత్తుపల్లి ప్రైవేటు వైద్యురాలు చేసిన వైద్యం వికటించడంతోనే బాలింత మృతి చెందిందని బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేసేందుకు సిద్ధపడుతుండగా ఆస్పత్రి నిర్వాహకులు, రాజకీయ నాయకులు ఖమ్మం నుంచి సత్తుపల్లికి అంబులెన్స్ లో వస్తున్న మృతదేహాన్ని సత్తుపల్లి శివారు కిష్టారం -కొమ్మేపల్లి మార్గమధ్యలోకి తరలించి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం.

డిప్యూటీ డీఎంహెచ్వో తలారి సీతారాం వివరణ

సత్తుపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన సంఘటనపై సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్వో ఓ తలారి సీతారాంను దిశ రిపోర్టర్ వివరణ కోరగా సోషల్ మీడియా ద్వారా బాలింత మృతి విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సంఘటన పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. 


Similar News