గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు
దిశ,గజ్వేల్ రూరల్ : సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు,గజ్వేల్ పోలీసులు గట్టి నిఘా పెట్టి టెక్నాలజీతో చాకచక్యంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి కేసు వివరాలు తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపురం గ్రామానికి చెందిన అరికెల శేఖర్ వృత్తి డ్రైవింగ్, అదే గ్రామానికి చెందిన బోయిని నరేష్ వృత్తి ఆటో డ్రైవింగ్, మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, మల్లబోయినపల్లి గ్రామానికి చెందిన సుక్కసారి భాను ప్రసాద్ వృత్తి హెచ్.పీ గ్యాస్ డెలివరీ బాయ్. ప్రస్తుత నివాసం సిద్దిపేట జిల్లా సిరిసినగండ్ల ఈ ముగ్గురు కలిసి చెడు అలవాట్లకు బానిసై గంజాయి అమ్మి డబ్బులు సంపాదిద్దామని నిర్ణయించుకున్నారు. సిద్దిపేట పరిసర ప్రాంతాలలో బైకులు దొంగతనం చేసి అదే మోటార్ సైకిల్ పై సీలేరుకు వెళ్ళి గతంలో 2, 3 సార్లు గంజాయి తీసుకొచ్చి గజ్వేల్, అహ్మదీపూర్, చుట్టుపక్కల గ్రామాల కూలీలకు యువకులకు రెట్టింపు ధరకు అమ్మారని తెలిపారు.
గత ఎనిమిది నెలల క్రితం సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మడానికి వెళుతుండగా త్రీ టౌన్ పోలీసులు పట్టుకుని గంజాయి మోటార్ సైకిల్ రికవరీ చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు. బెయిల్ పై వారు జైలు నుండి బయటకు వచ్చారని, గత వారం రోజుల క్రితం శేఖర్, నరేష్, గంజాయి తీసుకుని రావడానికి సీలేరు వెళ్తున్నామని వారి స్నేహితుడు భాను ప్రకాష్ కు ఫోన్ చేయగా నాకు పని ఉందని నేను రాను నాకు గంజాయి కావాలని రూ. 7000 లను శేఖర్ కు ఫోన్ పే చేశాడన్నారు. నరేష్ స్నేహితుడు చింటు బైక్ తీసుకుని అరికెల శేఖర్, బోయిని నరేష్ లు ఇద్దరు భద్రాచలం సీలేరుకు వెళ్లి వర్ధన్ అనే వ్యక్తికి 30,800 వేల రూపాయలు ఇచ్చి 20 కిలోల గంజాయి కొనుగోలు చేశారన్నారు.
మోటార్ సైకిల్ పై వస్తే ఎవరైనా పోలీసులు పట్టుకుంటారని అరికెల శేఖర్ ఒక బ్యాగులో 10 కిలోల గంజాయి పెట్టుకొని హైదరాబాద్ వరకు బస్సులో వచ్చాడని, అక్కడి నుంచి ఊరికి వచ్చి ఎవరైనా చూస్తారని అనుమానంతో ఊరు బయట గ్రామ శివారు మల్లన్నసాగర్ కట్ట వద్ద దాచి పెట్టాడన్నారు. గంజాయి కావాలని భానుప్రసాద్ రాగానే అందులో నుండి అతనికి 2 కిలోల గంజాయి ఇచ్చాడన్నారు. అరికెల శేఖర్, సుక్కసారి భాను ప్రసాద్ నిందితుల వద్ద నుంచి 10 కిలోల గంజాయి, మరియు 1 సెల్ ఫోన్లు, రికవరీ చేసి ఇద్దరు నిందితులను గజ్వేల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని త్వరలో పరారీలో ఉన్న నరేష్, వర్ధన్ ఇద్దరు నిందితులను పట్టుకుని అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు.
మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా
గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న మరియు అమ్ముతున్నారని సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 కు లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ మొబైల్ నెంబర్ 8712667100 నెంబర్ కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. పెద్ద మొత్తంలో గంజాయి పట్టించే వారికి నగదు పురస్కారం అందజేస్తామని పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లా గురించి కృషి చేస్తున్న పోలీసులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
పోలీసులకు అభినందనలు తెలిపిన సీపీ
గంజాయిని విక్రయిస్తున్న నిందితులతో పాటు చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, ఇన్స్పెక్టర్లు జానకి రామ్ రెడ్డి, రమేష్,సిబ్బంది, గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యం రాజు, సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి.అనురాధ అభినందించారు. త్వరలో వారికి రివార్డ్ ను అందజేయడం జరుగుతుందని తెలిపారు.