తల్లి కొడుకుల ప్రాణం తీసిన పెద్దల పంచాయితీ..

అందోలు మండలం చింతకుంట మంజీరా నదిలో దూకి తల్లి, కొడుకుల

Update: 2024-11-27 13:57 GMT

దిశ,అందోల్‌: అందోలు మండలం చింతకుంట మంజీరా నదిలో దూకి తల్లి, కొడుకుల అత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్, అతని తల్లి వడ్ల బాలమణీలు మంగళవారం సాయంత్రం మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం మృతుని తండ్రి యాదయ్య జోగిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు మృతుని తండ్రి వడ్ల యాదగిరి ఫిర్యాదు మేరకు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన (ఆదివారం) చింతకుంటకు చెందిన చాంద్‌పాషా ఇంట్లో జరిగిన విందుకు సంగారెడ్డికి చెందిన బంధువులు టాటా ఏసీ ఆటోలో హాజరుకాగా, అదే రోజు రాత్రి ఆటో కనిపించలేదు. గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్‌ ఆటోను ఎత్తుకేళ్లాడని సోమవారం చింతకుంట గ్రామ పెద్దలకు తెలియజేశారు.

దీంతో గ్రామ పెద్దలు మంగళవారం వడ్ల శ్యామ్‌ కుటుంబీకులను పిలిపించి పంచాయితీ నిర్వహించారు. ఆటోను చోరీకి పాల్పడినందుకు గాను గ్రామ పెద్దలు రూ.5 లక్షల జరిమానాను చెల్లించాలంటూ వడ్ల శ్యామ్, అతని కుటుంబీకులపై ఒత్తిడి తీసుకొచ్చారని పెర్కోన్నారు. జరిమానాను చెల్లించలేని పరిస్థితుల్లో ఉండడంతో పాటు గ్రామంలో పరువు పోయిందని భావించి వడ్ల శ్యామ్‌ (21) అతని తల్లి వడ్ల బాలమణి(45)లు తీవ్ర మనస్థాపానికి గురై మంగళవారం చింతకుంట వద్ద మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతుని తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనిల్‌ కుమార్‌ తెలిపారు.

ఏడుగురిపై కేసు నమోదు..

చింతకుంట బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో తల్లి, కొడుకులు దూకి అత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. గ్రామానికి చెందిన అస్లాం, మొగుల్, చాంద్‌పాషా, మైబేల్లి, శ్రీశైలం, శ్రీనివాస్, అంజనేయులుతో పాటు మరొకరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

మంజీరాలో గాలింపులు..మృతదేహాలు లభ్యం..

అందోలు మండలం చింతకుంట బ్రిడ్జిపై నుంచి మంజీరాలో దూకిన వారి మృతదేహలు బుధవారం సాయంత్రం లభ్యమయ్యాయి. చింతకుంట గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్‌ (21), అతని తల్లి వడ్ల బాలమణీ (46)లు మంగళవారం సాయంత్రం చింతకుంట బ్రిడ్జిపై నుంచి మంజీరాలోకి దూకిన సంగతి పాఠకులకు తెలిసిందే. అయితే బుధవారం ఉదయం మృతుల కుటుంబీకులు జోగిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ అనిల్‌ కుమార్, ఎస్‌ఐ పాండులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫైర్‌ సిబ్బంది, చింతకుంట, సింగూరుకు చెందిన గజ ఈతగాళ్లతో మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వడ్ల బాలమణి (46) మృతదేహం లభ్యంకాగా, సాయంత్రం 4:30 గంటల సమయంలో వడ్ల శ్యామ్‌ మృతదేహం లభ్యమైంది. ఈ రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చింతకుంటలో విషాదఛాయాలు..

అందోలు మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకులు అత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. మంజీరా నదిలో మృతదేహాలు లభ్యం కావడం తో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు మృతదేహాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో చింతకుంట బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను చూస్తూ బోరున విలపించారు.


Similar News