ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయం..ప్రేమ..పెళ్లి..మృత్యువాత

సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో ఒకరికొకరు

Update: 2024-12-18 14:52 GMT

దిశ,జగదేవపూర్: సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో ఒకరికొకరు పరిచయం ఏర్పడి ప్రేమించి పెళ్లి చేసుకొని చివరికి ఇంట్లో ఉరి వేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్ల పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... పీర్ల పల్లి గ్రామానికి చెందిన ఎర్ర బిక్షపతి సత్తెమ్మ దంపతుల కుమారుడు దయాకర్ హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఫోక్ సింగర్ శృతి (26)తో సోషల్ మీడియా ఇన్ స్ట్రాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త వివాహానికి దారి తీయడంతో గత 21 రోజుల క్రితం పీర్ల పల్లి గ్రామంలో బిక్షపతి సత్తెమ్మ దంపతులు దయాకర్ శృతికి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. ఈ వివాహానికి శృతి తరుపున బంధువులు ఎవరు సైతం రాలేదు.

అయినప్పటికీ దయాకర్ శృతి ఇద్దరు 21 రోజులుగా అన్యోన్యంగా జీవనం సాగించారు. కాగా బుధవారం పీర్లపల్లిలో దగ్గరి బంధువుల దశదినకర్మ ఉండడంతో కుటుంబ సభ్యులందరూ అక్కడికి వెళ్లగా మృతురాలు శృతి మాత్రం ఇంట్లోనే ఉంది. ఇంటి వద్ద ఉన్న శృతిని దశదినకర్మ వద్దకు తీసుకు వెళ్ళడానికి దయాకర్ రాగా ఇంట్లో ఉరి వేసుకొని కనిపించగా క్రిందకు దించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే దయాకర్ తల్లిదండ్రులు ఇంటికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించడంతో గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. శృతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.


Similar News