విద్యుత్ షాక్ తో బాల కార్మికుడు మృతి..
విద్యుత్ షాక్ తో ఓ బాల కార్మికుడు మృతి చెందాడు.
దిశ, కంటోన్మెంట్ : విద్యుత్ షాక్ తో ఓ బాల కార్మికుడు మృతి చెందాడు. బాలుడి మృత దేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తన సొంతూరికి తరలించేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చిన ఘటన సోమవారం మారేడ్ పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తర ప్రదేశ్, ఘోరక్ పూర్ జిల్లా దుమారి కాస్ ప్రాంతానికి చెందిన రాజేష్ నిషాద్ కుమార్ వినేయ్ నిషాద్ (17) అనే బాల కార్మికుడు పొట్టకూటి కోసం రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. హఫీస్ పేట ఆదిత్య నగర్ కాలనీలో నివాసం ఉంటూ ఇంటీరియర్ కాంట్రాక్టర్ దినేష్ లుంగాని వద్ద పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం వేస్ట్ మారేడ్ పల్లిలోని చింజరిక స్కాలర్ అపార్ట్ మెంట్ లో వినేయ్ నిషాద్ ఇనుప స్టూల్ మీద నిలబడి పనిచేస్తుండగా, విద్యుత్ వైర్ తెగి అతనికి ప్రమాదవశాత్తు తగిలింది.
దీంతో కరెంట్ షాక్ కు గురైన బాల కార్మికుడు వినేయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా బాల కార్మికుడిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో కాంట్రాక్టర్ బాల కార్మికుడి మృత దేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఇంటీరియర్ కాంట్రాక్టర్ దినేష్ లుంగానిపై బి.ఎన్.ఎస్ 106,304/ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నోముల వెంకటేశ్ తెలిపారు. మారేడ్ పల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.