కల చెదిరింది.. జాబ్ సాధించిన నెల రోజులకే మృత్యువు ఒడికి
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఏళ్లుగా శ్రమించాడు.
దిశ, కొత్తగూడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఏళ్లుగా శ్రమించాడు. పట్టుదలతో 45 ఏండ్లు వచ్చినా విక్రమార్కుడిలా ఉద్యోగం కోసం పోరాడాడు. ఎట్టకేలకు ఇటీవల విడుదలైన 2024 డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. అప్పటికే సూటిపోటి మాటలతో వేధిస్తున్న సమాజం నుండి ఇక సమస్య తొలగింది అనుకున్నాడు. జీవితంలో ఇక తనకు రాదనుకున్న ఉద్యోగాన్ని సాధించినందుకు తనతో పాటుగా భార్య పిల్లలు కూడా సంబరాల్లో మునిగిపోయారు. కానీ, విధి వక్రీకరించింది. తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందన్నట్లు దురదృష్టం అతని కుటుంబాన్ని వెంటాడింది. ఉద్యోగంలో చేరిన నెల కాకుండానే, కనీసం నెల జీతం సైతం అందుకోలేని పరిస్థితి దాపురించింది. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది.
మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్...
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. గంగారం మండల ఎస్సై రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గంగారం మండలంలోని మర్రిగూడెం గ్రామంలోని పుల్సాంవారి గుంపు పాఠశాలల్లో ఉపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్న సండ్ర ఉపేందర్(45) ఉదయం తన స్వగృహం బయ్యారం మండలం కొత్తపేట గ్రామం నుండి పాఠశాలకు వస్తున్న సందర్భంలో భావురుగొండ మూల మలుపు వద్ద వెనుక నుండి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఉపేందర్ కు ఇటీవల డీఎస్సీ 2024 లో ఎస్ జీటీ లో ఉద్యోగం సాధించాడు.మృతుడికి భార్య స్వప్న, కుమారుడు ప్రేమ్ తేజ, కూతురు శాన్విత ఉన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.