వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయి అరెస్ట్

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.6.93 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు.

Update: 2024-10-06 14:00 GMT

దిశ, రాజంపేట: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.6.93 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. ఆదివారం రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట పట్టణం కృష్ణానగర్ లో నివాసం ఉంటున్న లెక్చరర్ కొప్పు నాగరాజు (42) ఇంట్లో చోరీ జరిగిందన్నారు. ఈ చోరీకి సంబంధించి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయకుడు ఆదేశాల మేరకు తన ఆధ్వర్యంలో సి.ఐ కె ఎల్లమరాజు, ఎస్.ఐలు వి నాగేశ్వరరావు, వి యల్ ప్రసాద్ రెడ్డిలు తమ సిబ్బందితో ఒక టీం గా ఏర్పాటు చేశామన్నారు. చోరీ జరిగిన స్థలాన్ని పరిశీలించి అక్కడ లభించిన ఆధారాల మేరకు దర్యాప్తు తీవ్రతరం చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పల్లంపేటకు చెందిన వేములపల్లి విజయ్ కుమార్ (29) అనే ముద్దాయిని శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజంపేట పట్టణం రైల్వే బ్రిడ్జి కింద పట్టుకొని దొంగలించిన సొమ్ము అంతా రికవరీ చేశామన్నారు.

తన వద్ద నుంచి రూ. 6.93 లక్షలు విలువ చేసే 138.76 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.9,650లు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.ఫిర్యాదుదారుడు కొప్పు నాగరాజు తన ఇంటి గ్రిల్ డోర్ తాళం వేసి, తాళాలు ఇంట్లో సోఫా పైన కనపడే విధంగా ఉంచడంతో పాటు బీరువాకు తాళాలు వేసి తాళాలు తన ప్యాంట్ వేసుకొని తన డూప్లెక్స్ హౌస్ లో ని మొదటి అంతస్థులో నిద్రించారన్నారు. ముద్దాయి కిటికీలోని ఆ తాళాలను తీసుకొని, తాళాల సహాయంతనే ఇంటి తాళాలు తీసి దొంగతనం చేశారన్నారు. వేములపల్లి విజయకుమార్ పాత నేర చరిత్ర కలిగిన వారన్నారు. వివిధ పోలీసు స్టేషన్ లలో 44 దొంగతనాల కేసులు ఉన్నాయన్నారు.కొన్ని కేసులలో శిక్ష పడగా, మరికొన్ని కేసులు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉన్నాయన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఎవరికీ దొరకకుండా రాత్రి వేళల్లో రైల్వే స్టేషన్ కు సమీపంలోని ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నారన్నారు.

ఆ విధంగా గత రెండు సంవత్సరాలుగా ఈ దొంగతనం తో పాటు సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగతనాలు, రాజమండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 2, అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2, తాడేపల్లె గూడెం పోలీస్ స్టేషన్ లో 2, తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, ద్వారకా తిరుమల పోలీసు స్టేషన్ పరిధిలో ఒకటి దొంగతనాలు చేశారన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో 11 దొంగతనాలకు పాల్పడ్డారు. ప్రజలు వీలైనంత వరకు వారి వారి ఇండ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు పోలీసు వారికి సమాచారం ఇస్తే ఆ ఏరియాలో పోలీసు పెట్రోలింగ్ ద్వారా నిఘా ఉంచుతామన్నారు. ప్రజలు అందరూ పోలీసులు ఇచ్చే సమాచారాన్ని గమనిస్తూ ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయకుడు దొంగతనం కేసును చేధించిన పోలీసు సిబ్బందిని అభినందించారని డీఎస్పీ తెలిపారు.


Similar News