పేషంట్ పై దాడి చేసిన ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది..

ఒకప్పుడు రోగం వచ్చిందంటే చాలు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెల్లాలంటే భయపడేవారు.

Update: 2024-10-08 07:04 GMT

దిశ, అచ్చంపేట : ఒకప్పుడు రోగం వచ్చిందంటే చాలు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెల్లాలంటే భయపడేవారు. కానీ నేటి కాలంలో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చిన్న సమస్యకు కూడా అనేక టెస్టులు, మందులు రాసి అమాయక, సామాన్య రోగుల వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది వచ్చిన రోగుల పై దాడులు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఒక సంఘటనే అచ్చంపేట పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్స్ లో జరిగింది. బల్మూరు మండలంలోని కొండానాగుల గ్రామానికి చెందిన మహిళ పై ఆసుపత్రి సిబ్బంది దాడి చేశారు.

బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం 10 గంటలకు అచ్చంపేట పట్టణంలోని ఏఎంఆర్ లింగాల చౌరస్తాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో కొన్ని పరీక్షలు చేయించుకున్నామని తెలిపారు. అందుకు సంబంధించి బిల్లు 15 వందల కాగా వెయ్యి రూపాయలు చెల్లించామని తెలిపారు. నాగర్ కర్నూల్ ఆసుపత్రికి త్వరగా వెళ్లాలని తిరిగి వచ్చిన తర్వాత మిగతా డబ్బులు చెల్లిస్తానని చెప్పామన్నారు. దీంతో హాస్పిటల్ సిబ్బంది ససేమీరా వినకుండా బాధితురాలి పై దాడి చేసి గాయపరిచారని బాధితురాలు రోదిస్తూ తెలిపింది. ఈ విషయం తెలిసిన పట్టణవాసులు దాడి చేయడం దుర్మార్గమని, దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని , బాధితురాలు కుటుంబ సభ్యులు పట్టణ వాసులు కోరుతున్నారు.


Similar News