విషాదం నింపిన పండుగ…గునుక పువ్వు కోసం వ్యక్తి వెళ్లి మృత్యువాత

బతుకమ్మ పువ్వయిన గునుగును సేకరించడానికి వెళ్లిన వ్యక్తి బావిలో శవమై కనిపించాడు. ఎస్ఐ తాండ్ర నరేష్ తెలిపిన వివరాల ప్రకారం…

Update: 2024-10-07 13:02 GMT

దిశ, గన్నేరువరం: బతుకమ్మ పువ్వయిన గునుగును సేకరించడానికి వెళ్లిన వ్యక్తి బావిలో శవమై కనిపించాడు. ఎస్ఐ తాండ్ర నరేష్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని జంగాపల్లి గ్రామానికి చెందిన గుంటుక కాళిదాసు (50) ఆదివారం ఉదయం బతుకమ్మ తయారీకి వాడే గునుగు పువ్వులు తీసుకొని వస్తానని భార్య లక్ష్మికి చెప్పి ఇంటి నుండి వెళ్లాడు. బయలుదేరి వెళ్లిన వ్యక్తి మధ్యాహ్నం సమయం అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య గ్రామస్తులను, బంధువులను విచారించింది. అయినా ఆయన ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం గుంటుక నారాయణమూర్తి వ్యవసాయ బావిలో శవం తేలి ఉన్నదని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. తన భర్త గునుగు కోసే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.


Similar News