లారీ క్లీనర్ స్థాయి నుంచి 4సార్లు ఎమ్మెల్యే
దిశ, వెబ్‌డెస్క్: పుట్టింది అడవుల జిల్లా ఆదిలాబాద్. పెరిగింది అమ్మనాన్నలు లక్ష్మీ, పోచమల్లు ఒడిలో. చేసింది లారీ క్లీనర్ వృత్తి. చిన్నతనం నుంచే కమ్యూనిస్టు భావజాలాలు. ఎవరికైనా కష్టమొస్తే ప్రజాసంఘాలతో కలిసి పోరాడటం. ఇవన్నీ ఆయన నైజం. అందుకే ఆయన రాజకీయాల్లోకి రావడానికి పునాది వేశాయి. ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రతినిత్యం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయడానికి కారణం అయ్యాయి. పార్టీలో చేరినప్పటి నుంచి ఎర్రజెండకు మెరుపులు అద్దుతూ రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడిన […]
దిశ, వెబ్‌డెస్క్: పుట్టింది అడవుల జిల్లా ఆదిలాబాద్. పెరిగింది అమ్మనాన్నలు లక్ష్మీ, పోచమల్లు ఒడిలో. చేసింది లారీ క్లీనర్ వృత్తి. చిన్నతనం నుంచే కమ్యూనిస్టు భావజాలాలు. ఎవరికైనా కష్టమొస్తే ప్రజాసంఘాలతో కలిసి పోరాడటం. ఇవన్నీ ఆయన నైజం. అందుకే ఆయన రాజకీయాల్లోకి రావడానికి పునాది వేశాయి. ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రతినిత్యం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయడానికి కారణం అయ్యాయి. పార్టీలో చేరినప్పటి నుంచి ఎర్రజెండకు మెరుపులు అద్దుతూ రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడిన కమ్యూనిస్టు నేతగా పేరు పొందారు. సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మంగళవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థకు గురై కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఐ నేత గుండా మల్లేశ్.. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన్ను బతికిచేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. 1947 జులై 14న ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలో జన్మించిన గుండా మల్లేశ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
తన రాజకీయ జీవితంలో 8సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గుండా మల్లేశ్ ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో తొలిసారిగా సీపీఐ నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 1983,1985, 1994, 2009లో గెలుపొందారు. 2014, 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో పరాజయం చెందారు. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతిపట్ల సీపీఐ సీనియర్ నేతలు డి. రాజా, నారాయణ, చాడా వెంకటెరెడ్డి, అజీజ్ పాషా సంతాపం తెలిపారు.