సీన్ రివర్స్..గ్రీన్‌జోన్ జిల్లాలకు పాకుతున్న కరోనా
దిశ, న్యూస్ బ్యూరో: నిన్న మొన్నటి దాక వలస కార్మికులు, విదేశీ ప్రయాణికుల్లో కనిపించిన వైరస్ గడచిన 24 గంటల్లో సద్దుమణిగింది. ఆ స్థానంలో రాష్ట్రంలోని పల్లెల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఒకే రోజు 9 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా వైరస్ వ్యాపించింది. ఇక్కడ ఒక కేసు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 199 కొత్త కేసులు నమోదు […]
దిశ, న్యూస్ బ్యూరో:
నిన్న మొన్నటి దాక వలస కార్మికులు, విదేశీ ప్రయాణికుల్లో కనిపించిన వైరస్ గడచిన 24 గంటల్లో సద్దుమణిగింది. ఆ స్థానంలో రాష్ట్రంలోని పల్లెల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఒకే రోజు 9 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా వైరస్ వ్యాపించింది. ఇక్కడ ఒక కేసు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 199 కొత్త కేసులు నమోదు కాగా, అందులో 122 జీహెచ్ఎంసీ పరిధి, 40 రంగారెడ్డి జిల్లా, 10 మేడ్చల్ జిల్లాలో నమోదయ్యాయి. వలస కార్మికుల్లో కేవలం 3మాత్రమే కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఒకే రోజు 5గురు మహమ్మారి కారణంగా మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,698కి చేరగా, మృతుల సంఖ్య 82కు చేరుకుంది. వీలైనంత వరకు మరణాలు తగ్గించాలని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నా.. గత వారం రోజులుగా ప్రతిరోజూ కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ సమయం తగ్గిపోతుండడం, అంతర్ రాష్ట్ర రాకపోకలకు అవకాశం ఇస్తుండటంతో ఇంకెన్ని కేసులు పెరుగుతాయోననే ఆందోళన ప్రజల్లోనూ, ప్రజారోగ్య శాఖ సిబ్బందిలోనూ వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన వైరస్ ఇప్పుడు జగిత్యాల, నిర్మల్, జనగాం, మెదక్, సూర్యాపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం తదితర జిల్లాలకు కూడా పాకింది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు ఎక్కువగా ఈ జిల్లాలకు చెందిన వారు కావడంతో వారి నుంచి స్థానికులకు అంటుకుని ఉండవచ్చని స్థానిక ప్రజారోగ్య సిబ్బంది అనుమానిస్తున్నారు. కరోనా బారిన పడినవారిలో సీరియస్ కండిషన్ ఎవ్వరికీ లేదని, వెంటిలేటర్ లేదా ఆక్సిజన్ ఇవ్వాల్సిన కేసులు కూడా లేవని వైద్య విద్యాశాఖ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి చెప్పారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో ఐదు కరోనా మరణాలు సంభవించాయి.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 16 జిల్లాల్లో కరోనా వైరస్ లేదని, పద్నాలుగు రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని తేలింది. కానీ ఆదివారం నాటికి అది పన్నెండు జిల్లాలకు వ్యాపించింది. నాలుగు జిల్లాల్లో కొత్తగా వైరస్ కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం వరకూ కొత్త కేసుల కంటే డిశ్చార్జి అవుతున్న పేషెంట్ల సంఖ్యే ఎక్కువగా ఉండేది. కానీ కొత్త కేసుల సంఖ్య డిశ్చార్జి కంటే పెరిగిపోయింది. ఫలితంగా యాక్టివ్ కేసులు కూడా దాదాపుగా డిశ్చార్జి అయినవారికి సమంగా ఉంది. ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారు 1,428 ఉంటే యాక్టివ్ కేసుల సంఖ్య 1,188గా ఉంది.