ఆన్‌లైన్ సైట్స్‌లో బిజీగా జనం.. డబ్బులున్నా ఈఎంఐలే కావాలంటున్న కస్టమర్లు

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారి వచ్చి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. బిఫోర్ కొవిడ్, ఆఫ్టర్ కొవిడ్ అని చెప్పుకునేంతగా ప్రభావం చూపింది. అప్పటి వరకు ఇష్టారాజ్యంగా డబ్బులను మంచినీళ్లలా ఖర్చుపెట్టిన వాళ్లు సైతం నేడు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. జనమంతా ఈఎంఐల వైపే మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు మిడిల్ క్లాస్ కుటుంబాలు మాత్రమే ఎక్కువగా ఈఎంఐలపై ఆధారపడేవారు. కానీ, నేడు డబ్బులున్నా ఇన్‌స్టాల్‌మెంట్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్‌లాక్ అనంతరం షాపింగ్ మాల్స్ అన్నీ […]

Update: 2021-08-28 22:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారి వచ్చి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. బిఫోర్ కొవిడ్, ఆఫ్టర్ కొవిడ్ అని చెప్పుకునేంతగా ప్రభావం చూపింది. అప్పటి వరకు ఇష్టారాజ్యంగా డబ్బులను మంచినీళ్లలా ఖర్చుపెట్టిన వాళ్లు సైతం నేడు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. జనమంతా ఈఎంఐల వైపే మొగ్గుచూపుతున్నారు.

ఒకప్పుడు మిడిల్ క్లాస్ కుటుంబాలు మాత్రమే ఎక్కువగా ఈఎంఐలపై ఆధారపడేవారు. కానీ, నేడు డబ్బులున్నా ఇన్‌స్టాల్‌మెంట్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్‌లాక్ అనంతరం షాపింగ్ మాల్స్ అన్నీ తెరుచుకున్నాయి. కొవిడ్ ఎఫెక్ట్‌తో ఎప్పుడేమవుతుందోనని భయంతో ఎవరూ కొనేందుకు ముందుకు రావడంలేదు.

దీంతో ఆఫ్‌లైన్‌తో పాటు, ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు సైతం జనాన్ని ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అవసరమున్నా.. లేకున్నా.. ఆఫర్లు కొనేలా చేస్తున్నాయి. అన్ని వస్తువులపై ఈఎంఐ వెసులుబాటు కల్పించడంతో ధనవంతులు సైతం ఈఎంఐల వైపు మొగ్గుచూపుతున్నారు.

ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు మాత్రమే పరిమితమైన ఈఎంఐ విధానం ఇప్పుడు మరింత పెరుగుతోంది. బైక్ కొనాలన్నా, ఫోన్ కొనాలన్నా మిడిల్ క్లాస్ ప్రజలు ప్రతీనెల ఇన్‌స్టాల్‌మెంట్ పెట్టుకునేవారు. కానీ, ఇప్పుడు సంపన్నులు సైతం ఇదే కోవలో చేరిపోయారు. కొవిడ్ ప్రభావం ఎంతలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

కరోనా అందరి జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిందనేందుకు ఇదో ఉదాహరణగా నిలుస్తోంది. కొవిడ్ అనంతరం ఆర్థికంగా నష్టపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాల్లో కోతలు వంటి పరిస్థితుల కారణంగా ఎప్పుడేం అవసరం వస్తుందోనని చేతిలో డబ్బున్నా ఖర్చు చేయడంలేదు. ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో ఈఎంఐ ద్వారా లేదా పే లేటర్ అనే ఆప్షన్‌ను తీసుకురావడంతో జనాన్ని ఆకర్షిస్తున్నారు. దీనివల్ల డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 200 కుపైగా డిజిటల్ పేమెంట్ల శాతం పెరిగింది.

ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ప్రజలు ఆలోచించుకునే వాళ్లు. అలాంటిది ఈఎంఐలు చెల్లించే విధానంతో వారి ధోరణి రోజురోజుకూ మారుతోంది. దీంతో ఆ వస్తువు అవసరమున్నా, లేకున్నా కొనుగోలు చేస్తున్నారు. అన్‌లాక్ అనంతరం అన్ని షాపింగ్ మాల్స్ తిరిగి తెరుచుకోవడంతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి.

ఏకంగా 80 శాతం వృద్ధి సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బై నౌ.. పే లేటర్ లావాదేవీలు ఏకంగా 220 శాతం వృద్ధి చెందింది. కార్డురహిత ఈఎంఐ లావాదేవీలు 207 శాతం వృద్ధి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సంస్థలు జీరో ఇంట్రెస్ట్ ఆఫర్లు ఇవ్వడం వల్ల కూడా ఈ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి.

ఆర్థికభారం తగ్గింది

ఒక వస్తువు కొనాలంటే గతంలో అన్నింటికీ ఈఎంఐ విధానం లభించేది కాదు. కానీ, ఇప్పుడు సంస్థలు తమ అమ్మకాలు పెంచుకునేందుకు ఆఫర్లు పెట్టి ఆకర్షిస్తున్నాయి. దీనివల్ల సామాన్యులకు కొంత ఊరట. ఒకేసారి మొత్తం చెల్లించకుండా నెలల వారీగా చెల్లించే అవకాశం ఉండటంతో ఆర్థిక భారం చాలా తగ్గింది. దీనికితోడు జీరో ఇంట్రెస్ట్ విధానం ఉండటం కూడా కాస్త ఉపశమనం లభిస్తోంది.
= రవి, బ్యాంక్ ఉద్యోగి

సంస్థల ఆఫర్లతో ఎక్కువ కొనుగోళ్లు

కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఇబ్బందిపడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. అన్‌లాక్ అనంతరం ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్లు చూసి మనకు అవసరం లేని వస్తువులు కూడా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈరోజు కాకుంటే రైపటికైనా పనికొస్తుంది అనే ధోరణి సంపన్నుల్లో బాగా పెరిగిపోయింది. డబ్బులు చెల్లించే స్థోమత ఉన్నా ఈఎంఐలపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి.
= వినయ్ కుమార్, ప్రైవేట్ ఉద్యోగి

Tags:    

Similar News