అధ్యక్షా.. ఎందుకీ ఊగిసలాట?
ఒక్కరు వద్దంటున్నారు. మరొకరు కావాలంటున్నారు. పదవి కోసం కొందరు పైరవీలు సైతం చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్ఠానంలో మాత్రం స్పందన లేదు. అయితే, వద్దన్న వారిని పక్కన పెట్టకుండా.. కావాలన్న వారికి అవకాశం ఇవ్వకుండా పార్టీ తర్జన భర్జన పడుతుండటంపై ఊహాగానాలు మొదలయ్యాయి. టీపీసీసీ చీఫ్ మార్పుపై పార్టీ హైకమాండ్ మదిలో ఏముందో అర్థం కాక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పీసీసీ చీఫ్ కుర్చీ చుట్టూ సీనియర్ నేతలు మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు. కానీ, […]
ఒక్కరు వద్దంటున్నారు. మరొకరు కావాలంటున్నారు. పదవి కోసం కొందరు పైరవీలు సైతం చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్ఠానంలో మాత్రం స్పందన లేదు. అయితే, వద్దన్న వారిని పక్కన పెట్టకుండా.. కావాలన్న వారికి అవకాశం ఇవ్వకుండా పార్టీ తర్జన భర్జన పడుతుండటంపై ఊహాగానాలు మొదలయ్యాయి. టీపీసీసీ చీఫ్ మార్పుపై పార్టీ హైకమాండ్ మదిలో ఏముందో అర్థం కాక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
పీసీసీ చీఫ్ కుర్చీ చుట్టూ సీనియర్ నేతలు మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు. కానీ, పార్టీ హైకమాండ్ మాత్రం వద్దంటున్నవారిని పక్కన పెట్టడం లేదు.. కావాలంటున్నవారికి కుర్చీ ఇవ్వట్లేదు. అసలు పీసీసీ మార్పుకు అధిష్ఠానం డిసైడయ్యిందా? లేదా? అన్న విషయం ఆ పార్టీ నాయకుల మదిని తొలిచివేస్తోంది. గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ మార్పుపై రోజుకో చర్చ చక్కర్లు కొడుతోంది. ఇదిగో కొత్త పీసీసీ చీఫ్.. అదిగో కొత్త ప్రెసిడెంట్ అంటూ వార్తలు వస్తున్నా ఏదీ నిజ రూపం దాల్చడం లేదు. దీంతో పీసీసీ చీఫ్ మార్పుపై పార్టీ అధిష్ఠానం తర్జభర్జన పడుతోందన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఇప్పటికే ప్రస్తుత పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్ ఉపఎన్నికల అనంతరం త్వరలో తాను పీసీసీ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విషయం విధితమే. ఈ మాట చెప్పి ఆరు నెలలు గడుస్తోంది. అయినా అధిష్ఠానం మాత్రం కొత్త పీసీసీ చీఫ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మార్పు ఉన్నట్లా? లేనట్లా? అన్న విషయం ఆ పార్టీ నేతలకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కుంతియా సైతం ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్ష మార్పుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. కనీసం అలాంటి సంకేతాలు కూడా ఇవ్వకపోవడంతో పీసీసీ మార్పు ప్రక్రియలో స్పష్టత కనిపించడం లేదు.
సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, వీ హనుమంతరావులు మాత్రం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. దీంతో పీసీసీ మార్పు విషయంలో అధిష్ఠానం ఆచీతూచి అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. కీలక నేతలు పార్టీని వీడటంతో నియోజకవర్గాల్లో ఉనికి కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పీసీసీ చీఫ్‌ను మార్చడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న భావనలో అధిష్ఠానం ఉన్నట్టు ఆ పార్టీ వర్గీయలు చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు పీసీసీ అధ్యక్ష పదవికి బలమైన ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో పీసీసీ మార్పుతో పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడే పరిస్థితి లేకపోలేదన్న ఆలోచనతో పీసీసీ చీఫ్ మార్పు ప్రక్రియకు హైకమాండ్ బ్రేక్ వేసినట్టు చర్చ జరుగుతోంది.
అయితే, పదవి దక్కని నేతలు అసమ్మతి గళం వినిపించడంతోపాటు పార్టీని సైతం వీడే అవకాశం ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న పార్టీకి ఈ పరిణామలు తోడైతే కాంగ్రెస్ మరింత ఇరాకటంలో పడే అవకాశం ఉంది. దీంతో అధిష్ఠానం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పీసీసీ పదవి వద్దు బాబోయ్ అంటూ ఉత్తమ్ అల్లంత దూరం పోతున్నా హైకమాండ్ మాత్రం బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తోంది. అలాగని పీసీసీ చీఫ్ మార్పు జరగకపోతే పార్టీకి కొత్త ఊపురాదంటున్నారు మరికొందరు నేతలు.