బీజేపీ నేతల్లో బుగులు
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి జంప్ అవుతుండడంతో కమల నాథులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్‌కు బీజేపీ నేతలు వలస పట్టడంతో ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇప్పటికే ఒక జెడ్పీటీసీ, నలుగురు కార్పొరేటర్లు, ఒక కౌన్సిలర్, ఎంపీటీసీలు కారెక్కారు. మరికొంతమంది కూడా వెళ్లేందుకు రెడీగా ఉండడంతో బడా నేతలు సతమతమవుతున్నారు. బీజేపీ ప్రజాప్రతినిధులు 78 మంది.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానాన్ని […]
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి జంప్ అవుతుండడంతో కమల నాథులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. టీఆర్ఎస్ చేపట్టిన ఆకర్ష్‌కు బీజేపీ నేతలు వలస పట్టడంతో ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇప్పటికే ఒక జెడ్పీటీసీ, నలుగురు కార్పొరేటర్లు, ఒక కౌన్సిలర్, ఎంపీటీసీలు కారెక్కారు. మరికొంతమంది కూడా వెళ్లేందుకు రెడీగా ఉండడంతో బడా నేతలు సతమతమవుతున్నారు.
బీజేపీ ప్రజాప్రతినిధులు 78 మంది..
2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ.. అదే ఉత్సాహంతో ఉమ్మడి జిల్లాలో 78 మంది ప్రజా ప్రతినిధులుగా గెలిచారు. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ, టీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి. 824 మంది ఓటర్లు ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతన్ కర్ లక్ష్మీ నారాయణ.. టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎంపీ కవిత బరిలోకి దిగారు. ఏప్రిల్ 7న జరగాల్సిన ఎన్నికలు కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డాయి. ఆనాడే ఆకర్ష్ అస్త్రాన్ని సిద్ధం చేసిన అధికార పార్టీ కరోనా నెమ్మదించి ఎన్నికల సైరన్ మోగనుండడంతో ఇప్పుడు జోరుగా ఇతర పార్టీల నేతలను చేర్చకునే పనిలో పడింది. ముఖ్యంగా బీజేపీ ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసింది. బీజేపీ ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ముందుగా సంక్షేమ నిధులపై కోతలు వేసింది. దానికి తోడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు అధికారుల సహకారం కరువైంది. మనీ మేనేజ్ మంత్రం, అభివృద్ధి నిధుల పేరుతో అధికార పార్టీ బుట్టలో వేసుకుంటోందన్న ఆరోపణలు ఉన్నారు. అందుకే ఉమ్మడి జిల్లాలో బీజేపీ ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీలోకి వరుస కట్టారని చెప్పుకుంటున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు జారిపోతున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మి నర్సయ్య స్పందించట్లేదని పలువురు నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఒక జెడ్పీటీసీ, ముగ్గురు కార్పొరేటర్లు పార్టీ మారినప్పుడు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించినా వారిలో భరోసా నింపలేదని తెలిసింది. జిల్లాలో ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లాం.. వారే చూసుకుంటారనే ధోరణి జిల్లా నేతల్లో కనిపిస్తోన్నది. కనీసం ఎవ్వరూ ఏ పార్టీ నేతలను కలుస్తున్నారు.. వారిలో పార్టీ మారేవారు ఎవరు.. వారిని పార్టీ మారకుండా ఎలా నిరోధించాలని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అంతే గాకుండా పార్టీలో టికెట్ ల కేటాయింపుల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఇచ్చారని.. ప్రస్తుతం వారే పార్టీ మారుతున్నారని ఓ వర్గం నేతలు చెబుతున్నారు.
అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం!
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకోవడంతో ఆపరేషన్ ఆకర్ష్ ప్రవేశపెట్టింది. మొదటగా నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ జెడ్పీటీసీ యమున టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాలో జరుగుతున్న పార్టీ మార్పిడి వ్యవహారాలు బీజేపీ, అధికార టీఆర్ఎస్ పార్టీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. ఏడాది వ్యవధిలోనే పార్టీకి బీజేపీ నేతలు రాం రాం చెప్పడంతో ఎంపీ అరవింద్ ఆలోచనలో పడ్డారు.
బీజేపీ సమావేశాలు..
ఇటీవల పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులతో ఎంపీ అరవింద్ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా కేంద్రానికి చెందిన 25 మంది కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఎవరూ పార్టీ మారకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. 15 మంది కార్పొరేటర్లు ఎవ్వరు పార్టీ మారుతారని వచ్చిన ఆరోపణల మేరకు వారితో మాటామంతి జరిపినట్లు తెలిసింది. త్వరలో జరిగే స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నికల వరకు బీజేపీ ప్రజా ప్రతినిధులపై నిఘా పెంచారు.