సీఎం కేసీఆర్ గారు.. మంథనికో న్యాయం.. మధిరకో న్యాయమా.?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మంథనిలో జరిగిన దళితుల మరణాలపై ఓ రకమైన స్పందన ఉంటే మధిరలో జరిగిన లాకప్ డెత్‌పై మరో రకమైన స్పందన ఉండటం విస్మయం కల్గిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా మంథని నియోజకవర్గంలో జరిగిన దళితుల మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కినవే. ఈ ఘటనలపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేశాయి. మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూంలో చున్నితో ఉరి వేసుకుని చనిపోయిన శీలం రంగయ్య విషయంపై కాంగ్రెస్ పార్టీ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మంథనిలో జరిగిన దళితుల మరణాలపై ఓ రకమైన స్పందన ఉంటే మధిరలో జరిగిన లాకప్ డెత్‌పై మరో రకమైన స్పందన ఉండటం విస్మయం కల్గిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా మంథని నియోజకవర్గంలో జరిగిన దళితుల మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కినవే. ఈ ఘటనలపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపణలు చేశాయి. మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూంలో చున్నితో ఉరి వేసుకుని చనిపోయిన శీలం రంగయ్య విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు.
అప్పుడు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క కూడా మంథనిలో పర్యటించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత గవర్నర్‌ను కలిసి వినతి పత్రం కూడా అందించారు. అయితే, శీలం రంగయ్య వారసుల్లో ఒకరికి స్థానిక జేఎన్‌టీయూలో ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇప్పించారు. కానీ, వారికి ఎలాంటి పరిహారం మాత్రం ప్రభుత్వం అందించలేదు. శీలం రంగయ్య బాత్రూంలో ఊరి వేసుకుని చనిపోయాడని పోలీసులు చెప్పినప్పటికీ ఇది లాకప్ డెత్ అనే ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, తాజాగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో మరియమ్మ అనే మహిళ లాకప్ డెత్‌లో చనిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని బాధ్యులైన పోలీసులపై వేటు వేశారు.
అలాగే బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బృందానికి సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఫిక్స్ అయింది. అయితే, మంథనిలో జరిగిన శీలం రంగయ్య అనుమానాస్పద మృతిపై మాత్రం స్థానిక పోలీసులే చొరవ తీసుకున్నారు తప్ప.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. గతేడాది మే 26న జరిగిన శీలం రంగయ్య మరణం గురించి నేటికీ కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే, రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసిన సీఎల్పీ టీంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. గతంలో మంథనిలో జరిగిన మరణాల గురించి ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకపోవడంలో ఆంతర్యం ఏంటీ అన్న చర్చ సాగుతోంది.
ఇక్కడ అన్ని సంచలనాలే..
మంథని నియోజకవర్గంలో జరిగిన దళితుల మరణాలన్నీ కూడా సంచలానాలుగానే మారాయి. ఖానాపూర్‌కు చెందిన మంథని మధుకర్, మహాముత్తారానికి చెందిన కవిరాజు, మల్హర్ మండలం మల్లారానికి చెందిన రేవెళ్లి రాజారామ్‌ల మరణాలపై కూడా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. కొన్నిచోట్ల నిరసనలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే కౌంటర్‌గా మంథని టీఆర్ఎస్ నాయకులు కూడా ఆందోళన చేస్తామని ప్రకటించారు. దీంతో, పోలీసు బలగాలు మోహరించాల్సి వచ్చింది. ఇన్ని సంచలన మరణాలు కూడా శ్రీధర్ బాబు.. సీఎం దృష్టికి తీసుకురాకపోవడమేంటో అంతుచిక్కకుండా తయారైంది.