పైసలు కావాలంటే లాక్ డౌన్ ఎత్తివేయక తప్పదా?

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడిలో కేంద్రం తీసుకున్ననిర్ణయాలకంటే కాస్త కఠినంగానే వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మే 7వ తేదీ తర్వాత ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అమలవుతున్నట్లుగానే కఠిన ఆంక్షలను కొనసాగించడమా? లేక కేంద్రం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా సడలించడమా? ఇప్పటికే 45 రోజులకు పైగా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతిన్నందున వైరస్ తీవ్రత లేని ప్రాంతాల్లో మామూలు స్థితి నెలకొనేలా కేంద్ర మార్గదర్శకాలకు లోబడి అన్ని అనుమతులూ ఇచ్చేయడమా? ఇవి ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాళ్ళు. వైరస్ […]

Update: 2020-05-02 10:10 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడిలో కేంద్రం తీసుకున్ననిర్ణయాలకంటే కాస్త కఠినంగానే వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మే 7వ తేదీ తర్వాత ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అమలవుతున్నట్లుగానే కఠిన ఆంక్షలను కొనసాగించడమా? లేక కేంద్రం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా సడలించడమా? ఇప్పటికే 45 రోజులకు పైగా లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతిన్నందున వైరస్ తీవ్రత లేని ప్రాంతాల్లో మామూలు స్థితి నెలకొనేలా కేంద్ర మార్గదర్శకాలకు లోబడి అన్ని అనుమతులూ ఇచ్చేయడమా? ఇవి ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాళ్ళు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ రెండవ విడత లాక్‌డౌన్ మే 3వ తేదీతో ముగుస్తున్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం మరో నాలుగు రోజులు పెంచి మే 7 వరకు కొనసాగిస్తోంది. కానీ ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వెళ్ళాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 5వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఉండనున్నట్లు తెలిసింది. అయితే నిర్ణయం తీసుకోడానికి ముందు అన్ని జిల్లాల్లోని తాజా పరిస్థితులను ప్రధాన కార్యదర్శి సేకరిస్తున్నారు. హైదరాబాద్‌లో వైరస్ తీవ్రత ఉన్నందున మే 7వ తేదీ నాటికి పరిస్థితి ఎలా ఉండబోతుంది, మూడవ విడత లాక్‌డౌన్ ముగిసే మే 17వ తేదీ నాటికి ఎలా ఉండబోతుందో అంచనా వేసి దానికి అనుగుణంగా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించడం ద్వారా ఇప్పుడు జరిగిన నష్టానికి కేంద్రం నుంచి వివిధ రూపాల్లో ఎంతో కొంత పరిహారం పొందవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. స్వయంగా సీఎం కేసీఆరే హెలికాప్టర్ మనీ, ఆరు నెలల వరకు అప్పులను తిరిగి చెల్లించే అవసరంలేకుండా గడువు ఇవ్వడం, ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని పెంచడం, రిజర్వు బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్‌కు అనుమతి లభించడం తదితరాలను ప్రస్తావించారు. అయితే కేంద్రం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే అమలుచేయడం ద్వారా ‘తెలంగాణ ప్రభుత్వం తు.చ. తప్పకుండా పాటించింది’ అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుందన్నది అధికార పార్టీ నేతల భావన. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా వెళ్ళినట్లయితే డిమాండ్ చేసి సాధించుకునే అవకాశం ఉండకపోవచ్చన్నది వారి ఉద్దేశం. అందువల్ల ఎలాగూ ఇప్పుడు నాలుగు రోజుల గడువు పెంచడం ప్రజల భద్రత దృష్ట్యా అనివార్యమే అయినా ఈసారి మాత్రం కేంద్రానికి అనుగుణంగానే వెళ్ళాలనుకుంటున్నట్లు సమాచారం.

రూ. 19 వేల కోట్ల ఆదాయానికి గండి

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల ప్రకారం ప్రతీరోజూ సగటున రూ. 400 కోట్ల చొప్పున వచ్చే ఆదాయం లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. మే 7వ తేదీ వరకూ ఇదే పరిస్థితి ఉంటున్నందున జనతా కర్ప్యూ మొదలు ఇప్పటిదాకా 47 రోజులకు దాదాపు రూ. 19 వేల కోట్లు రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోయింది. కేంద్రం నిర్ణయానికి భిన్నంగా మరికొన్ని రోజులు పూర్తిస్థాయి లాక్‌డౌన్ పొడిగించినట్లయితే ఆ మేరకు మరింత నష్టం తప్పదని ఆర్థిక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఖరీఫ్ సీజన్‌కు రైతుబంధు సాయం అందించడం, రైతుబీమా రెన్యూవల్, రుణ మాఫీ, కల్యాణలక్ష్మి లాంటి ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులు అవసరమవుతున్నందున ఆర్థికంగా కుదుటపడక తప్పదని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా కొన్ని ఖర్చులు మాత్రం తప్పదని, వీటికోసం ప్రస్తుతానికి అప్పులపై ఆధారపడుతున్నా స్వీయ ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం అనివార్యమని వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి లేని ప్రాంతాల్లో పరిమితమైన ఆంక్షలతో దాదాపు మామూలు స్థాయి పనులు చేసుకోవచ్చని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో పాటించాలనుకుంటున్నట్లు తెలిసింది. తక్షణం ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే మద్యం, రోడ్ టాక్స్, పెట్రోలు ఉత్పత్తుల ద్వారా వచ్చే వాణిజ్య పన్నులు.. ఇలాంటివన్నీ యధావిధిగా నడిచేలా మంత్రివర్గంలో నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తొమ్మిది జిల్లాలు గ్రీన్ జోన్‌లోనూ, మరో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లోనూ ఉన్నందున అక్కడ మామూలు కార్యకలాపాలు జరిగేలా మే 7వ తేదీ నుంచి ఆంక్షలను సడలించడమే శ్రేయస్కరమని కొద్దిమంది అధికారుల అభిప్రాయం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో స్టోన్ క్రషర్స్, ఇటుక బట్టీలు, సిమెంటు ఫ్యాక్టరీలు, పేపరు పరిశ్రమలు, భవన నిర్మాణాలు, స్టీల్ పరిశ్రమలు, రిపేరు వర్క్‌షాపులు, సిరమిక్ టైల్స్ పరిశ్రమలు.. ఇలా మొత్తం 16 రకాల ఫ్యాక్టరీలు పనిచేసుకునేలా జిల్లా కలెక్టర్లు అనుమతి మంజూరు చేశారు. మే 7 తర్వాత రెడ్ జోన్ మినహా మిగిలిన అన్నిచోట్లా ఈ కార్యకలాపాలు యధావిధిగా జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

క్యాబినెట్ మీటింగ్‌కు ముందు సీఎస్ కసరత్తు

ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలవుతున్నందున ఆ మరుసటి రోజు నుంచి ఏం చేయాలన్నదానిపై ప్రధాన కార్యదర్శి కసరత్తు మొదలుపెట్టారు. అన్ని జిల్లాల్లోని తాజా పరిస్థితులను కలెక్టర్ల ద్వారా సీఎస్ తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ నగరం రెడ్‌జోన్‌లో ఉన్నందున ఏయే ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ క్లస్టర్లు ఉన్నాయి, ఎన్ని రోజుల్లో ఇవి మామూలు స్థితికి చేరుకోనున్నాయి, పాజిటివ్ పేషెంట్ల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల పరిస్థితేంటి, మలక్‌పేట్ గంజ్ లాంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఏ మేరకు ఉంది, నగరంలోని ఎన్ని ప్రాంతాల్లో యధాతథ స్థితిని పునరుద్ధరించే అవకాశం ఉంది తదితర అనేక అంశాలపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, ఈ మూడు జిల్లాల వైద్యాధికారులు, రాష్ట్ర డైరెక్టరు… ఇలా పలు శాఖల అధికారులతో ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.

వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళిపోతున్నందున ఆ ప్రభావం పరిశ్రమలపైనా, భవన నిర్మాణాలపైనా ఏ మేరకు పడే అవకాశం ఉంది, ఫలితంగా ఆ రంగాలు మళ్ళీ ఎప్పుడు కోలుకుంటాయి తదితర అంశాలపై కూడా సీఎస్ సుమారు రెండున్నర గంటల పాటు నోడల్ అధికారులతో చర్చించారు. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది, యధావిధిగా ఆ పనులన్నీ జరగాలంటే ఉన్న ప్రత్యామ్నాయాలేంటి తదితరాలపై కూడా ఈ సమావేశంలో సీఎస్ చర్చించారు. జిల్లాల నుంచి తాజా, క్షేత్రస్థాయి పరిస్థితులు, కలెక్టర్లు వెలిబుచ్చే అభిప్రాయాల ఆధారంగా క్యాబినెట్ సమావేశంలో చర్చించి దానికి అనుగుణమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది.

లాక్‌డౌన్ పోయినా వైరస్ వ్యాప్తి తప్పదా?

వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నాయి. దాని ద్వారా పరిస్థితి చేయిదాటిపోకుండా నియంత్రణలో ఉంది. ఈ నిర్ణయం కారణంగానే అనేక దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు చాలా అదుపులో ఉన్నాయి. లాక్‌డౌన్‌ను ఎంతకాలం కొనసాగించినా వైరస్ పూర్తిగా మాయమవుతుందనుకోలేమని వైద్యులే చెప్తున్నారు. మరికొన్ని నెలలు లాక్‌డౌన్‌ను కొనసాగించినా కొత్త పాజిటివ్ కేసులు వస్తూనే ఉంటాయని, కానీ అదే సమయంలో ప్రజల జీవితాలు అగమ్యగోచరంగా మారుతాయనేదీ కాదనలేని సత్యం. ఇప్పటికే రెక్కాడితే తప్ప డొక్కాడని అసంఘటిత కార్మికులు లాక్‌డౌన్ కాలంలో అనేక అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రతీరోజు వ్యాపారం జరిగితే తప్ప కుటుంబాలు నెట్టుకురాలేని చిరు వ్యాపారులు లక్షల సంఖ్యలోనే ఉన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా వైరస్ వ్యాప్తి నివారణకు వ్యక్తిగత క్రమశిక్షణతో ముఖానికి మాస్కు ధరించడం, పరిశుభ్రత పాటించడం తప్పదని కేంద్రమే స్పష్టం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం సైతం ఇలాంటి జాగ్రత్తలే చెప్తూ లాక్‌డౌన్‌ను ఎత్తివేసి కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలనుకుంటున్నట్లు ప్రాథమిక సమాచారం. ఒకవైపు స్వీయ ఆర్థిక వనరులను రాబట్టుకుంటూనే మరోవైపు కేంద్రం చెప్పినట్లుగా నడుచుకున్నందున రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ప్రధానిపై వత్తిడి తేవాలన్న రాజకీయ ఎత్తుగడ కూడా ఒక అంశంగా తెరపైకి వస్తోంది. క్యాబినెట్ సమావేశంలో ఏం నిర్ణయం జరుగుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags: Telangana, Corona, LockDown, Cabinet Meeting, Restrictions, Central Government, PM Modi, Chief Secretary

Tags:    

Similar News