జోరు పెంచిన చిరుమర్తి.. ఆ పొజిషన్ కోసమేనా..!

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆ ఎమ్మెల్యే దాదాపు రెండేండ్ల క్రితం వరకు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నమ్మినబంటు. నిత్యం ప్రజల్లో ఒకరిగా ఉంటూ వచ్చాడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలిచేవారు. సొంత పార్టీ కార్యకర్తలే కాదు.. పనికోసం ఎవ్వరు వచ్చిన కాదనకుండా చేసేవారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అధికార పార్టీలోకి జంప్ చేశారు. పార్టీ మారడంతోనో.. లేక మరేదైనా ఇతర కారణమో తెలియదు గానీ ఆ […]

Update: 2021-07-06 00:05 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆ ఎమ్మెల్యే దాదాపు రెండేండ్ల క్రితం వరకు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నమ్మినబంటు. నిత్యం ప్రజల్లో ఒకరిగా ఉంటూ వచ్చాడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలిచేవారు. సొంత పార్టీ కార్యకర్తలే కాదు.. పనికోసం ఎవ్వరు వచ్చిన కాదనకుండా చేసేవారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అధికార పార్టీలోకి జంప్ చేశారు. పార్టీ మారడంతోనో.. లేక మరేదైనా ఇతర కారణమో తెలియదు గానీ ఆ ఎమ్మెల్యే దూకుడు పెంచారు. ఇటు పార్టీ వ్యవహారాల్లోనూ.. అటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ప్రస్తుతం జిల్లా పాలిటిక్స్‌లో రోజురోజుకీ హైలెట్ అవుతోన్న చిరుమర్తి లింగయ్య ఆంతర్యం ఏమిటన్నది రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు.

మొదట్నుంచీ కోమటిరెడ్డి వర్గీయులు..

నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి కోమటిరెడ్డి వర్గమే. జడ్పీటీసీ మొదలు.. 2009 ఎన్నికల్లో నకిరేకల్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవడంలో కోమటిరెడ్డి వర్గానిది కీలక పాత్ర. అనంతరం 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసినా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కాదని.. టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. అధికార పార్టీలో చేరిన తర్వాత మొదట్లో కాస్తంత స్తబ్ధుగా ఉంటూ వచ్చారు. కానీ కొన్ని అనుహ్య పరిణమాలు చోటుచేసుకోవడం.. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు సన్నిహితంగా మెలగడంతో చిరుమర్తికి జిల్లాలోనూ ప్రయారిటీ పెరిగింది. దీంతో ఎమ్మెల్యే లింగయ్య జిల్లాలో తన దూకుడును పెంచారు. పార్టీ కార్యక్రమాల్లోనే కాదు.. అభివృద్ధి కార్యక్రమాల్లోనూ హవా కొనసాగిస్తున్నారు.

దళిత సాధికారత పేరుతో పాదయాత్ర..

ఇటీవల సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ‘దళిత సాధికారత పథకం’ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సమర్ధిస్తూ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌లోని ట్యాంకుబండ్ వరకు దళిత సంఘాలతో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కృతజ్ఞతా పాదయాత్ర ముగింపు సభను పెద్దఎత్తున చేపట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై అందరి దృష్టి పడింది. దళిత సంఘాలతో పాదయాత్ర నిర్వహించడంతో ఇటు ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లారు. ఇది వ్యక్తిగతంగా చిరుమర్తికి మంచి మైలేజ్ అని చెప్పాల్సిందే.

మంత్రివర్గ రేసులో నిలిచేందుకేనా..?

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి ఒక్కటే మంత్రి పదవి దక్కింది. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జగదీష్ రెడ్డి ఒక్కరే మంత్రిగా ఉంటూ వస్తున్నారు. అయితే జిల్లాకు మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ మొదట్నుంచీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సీఎం కేసీఆర్ జిల్లాకు మరో మంత్రి పదవి అవకాశం ఇస్తామనే సంకేతాలు ఇచ్చారు. దీనికితోడు రాష్ట్ర మంత్రి వర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దగా మంత్రి పదవి ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తే.. అందులో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మంచి అవకాశాలు ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. దీనికితోడు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఎమ్మెల్యే చిరుమర్తి సైతం మంత్రి పదవిని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News