చిన్నారుల ప్రాణాలు తీస్తోన్న ఈత సరదా..
దిశ , వరంగల్ : కరోనా మహమ్మారి ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా అమాయకుల ప్రాణాలు తీసుకుంటోంది. వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ అమలులో భాగంగా విద్యా సంస్థలు మూతబడ్డాయి. దీంతో స్టూడెంట్లు గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ఈత కొట్టడానికి, చేపల వేటకు వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన పదిహేను రోజుల్లో మహబూబాబాద్ జిల్లాలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వరుస ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం నివారణ చర్యలు […]
దిశ , వరంగల్ : కరోనా మహమ్మారి ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా అమాయకుల ప్రాణాలు తీసుకుంటోంది. వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ అమలులో భాగంగా విద్యా సంస్థలు మూతబడ్డాయి. దీంతో స్టూడెంట్లు గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో ఈత కొట్టడానికి, చేపల వేటకు వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన పదిహేను రోజుల్లో మహబూబాబాద్ జిల్లాలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వరుస ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం నివారణ చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరుస విషాదాలు..
కరోనా దెబ్బకు ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు స్కూల్స్ లేకపోవడంతో పిల్లలపై కూడా ఆందోళన పడాల్సి వస్తోంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు ఎటు పోయారో.. ఎక్కడ తిరుగుతున్నారోనని ఆందోళన చెందుతున్నారు. తరచూ చెరువులో పడి పిల్లలు చనిపోతున్న ఘటనలు జరుగుతుండడంతో టెన్షన్ పడుతున్నారు. ఏటా ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత దృష్ట్యా ఈతకు వెళ్లేవారు. ఇప్పుడు వర్షాకాలం మొదలైనా ఈతలకు వెళ్తూనే ఉన్నారు. దీంతో పోలీస్ యంత్రాంగం వారిని కట్టడి చేయడం కోసం చెరువులు, రిజర్వాయర్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేవారు. ఈ సారి లాక్‌డౌన్ విధుల్లో పోలీసులు బిజీగా ఉన్నారు. కొద్దిరోజుల కిందట లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో జనం రోడ్లపైకి వస్తున్నారు. జూన్ రెండో వారంలో తెరుచుకోవాల్సిన విద్యాసంస్థలు మూసి ఉండడంతో పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చిన్నపిల్లల తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి పొలాలు, చెరువులు, వాగుల వద్దకు వెళ్తున్నారు. వర్షాకాలం ఆరంభం కావడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో చిన్నారులు సరదాగా చెరువుల్లో చేపలు పట్టడం, ఈత కోసం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మూడు రోజుల కిందట మహబూబాబాద్ జిల్లాలోని శనిగపురం గ్రామ సమీపంలోని బోడతండాకు చెందిన నలుగురు చిన్నారులు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. సరదా కోసం ఈత కొట్టేందుకు చెరువులో దిగి నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నలుగురు చనిపోయారు. అంతకు ముందు వారం రోజుల క్రితం కురవి మండలంలో బావిలోకి ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస సంఘటనలు జిల్లాలో కలకలం రేపాయి.
అవగాహన అవసరం..
అధికారులు నివారణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేగాకుండా చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల వద్దకు పిల్లలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మత్స్య కారులు చెరువుల్లో చేపలు పెంచుతున్నందున చోరీ జరగకుండా విద్యుత్ తీగలు అమరుస్తున్నారు. దీనివల్ల కూడా పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.