సరిహద్దుల్లో పేలుతున్న తూటాలు..

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : మాట‌కు మాట‌.. తూటాకు తూట‌. తెలివితో పోలీసులు.. తెగువ‌తో మావోయిస్టులు చ‌ర్ల అడ‌వుల్లో విరుచుకు ప‌డుతున్నారు. దాదాపు ద‌శాబ్ద కాలంగా సైలెంట్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌చ‌ర్ల అడ‌వుల్లో ఇప్పుడు కాల్పుల మోత నిత్య‌కృత్యంగా మారింది. వారిని ప‌ట్టుకునేందుకు వీరు.. వీరిని చంపేందుకు వారు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో కదం తొక్కుతున్నట్లు తెలుస్తోంది. గ‌త ఐదు నెల‌ల కాలంలో క్ర‌మంగా క‌ద‌లిక‌ల పెరిగిన‌ట్లుగా గుర్తించిన పోలీసులు ప్ర‌త్యేక బ‌ల‌గాల‌తో కూంబింగ్ నిర్వ‌హిస్తూ అడ‌విని జ‌ల్లెడ ప‌డుతున్నారు. […]

Update: 2020-11-06 21:52 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : మాట‌కు మాట‌.. తూటాకు తూట‌. తెలివితో పోలీసులు.. తెగువ‌తో మావోయిస్టులు చ‌ర్ల అడ‌వుల్లో విరుచుకు ప‌డుతున్నారు. దాదాపు ద‌శాబ్ద కాలంగా సైలెంట్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌చ‌ర్ల అడ‌వుల్లో ఇప్పుడు కాల్పుల మోత నిత్య‌కృత్యంగా మారింది. వారిని ప‌ట్టుకునేందుకు వీరు.. వీరిని చంపేందుకు వారు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో కదం తొక్కుతున్నట్లు తెలుస్తోంది. గ‌త ఐదు నెల‌ల కాలంలో క్ర‌మంగా క‌ద‌లిక‌ల పెరిగిన‌ట్లుగా గుర్తించిన పోలీసులు ప్ర‌త్యేక బ‌ల‌గాల‌తో కూంబింగ్ నిర్వ‌హిస్తూ అడ‌విని జ‌ల్లెడ ప‌డుతున్నారు.

వరుసగా ఎన్‌కౌంటర్లు..

చ‌ర్ల‌తో పాటు మ‌ణుగూరు, క‌ర‌క‌గూడెం, గుండాల‌, పాల్వంచ అడ‌వుల్లో మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌ను ఆధారాల‌తో స‌హా పోలీసులు గుర్తించారు. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 3న గుండాల దేవ‌ళ్ల‌గూడెం వ‌ద్ద ఒక‌రిని, అదే నెల 7న చ‌ర్ల మండల కేంద్రానికి స‌మీపంలోని పునుగొప్ప వ‌ద్ద ఇద్ద‌రిని, ఛత్తీస్‌గ‌ఢ్‌కు అత్యంత స‌మీపంలో ఉండే ఇదే మండ‌ల ప‌రిధిలో సెప్టెంబర్ 18న మ‌రో ముగ్గురిని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. ఇందులో ఇద్ద‌రు మ‌హిళా మావోయిస్టులు ఉండ‌టం గ‌మ‌నార్హం. నాటి నుంచి ప్ర‌తీకారంతో ర‌గిలిపోతున్న మావోయిస్టులు వెంక‌టాపురం మండ‌లంలో ఒక స‌ర్పంచ్‌ను హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే. తాజాగా రెండు రోజుల కిందట హోంగార్డు ఈశ్వ‌ర్‌ను హ‌త‌మార్చారు. ఉద్య‌మానికి స‌హ‌క‌రిస్తున్న‌ట్లుగా న‌టించి, ద‌ళాల స‌మాచారం పోలీసుల‌కు అంద‌జేస్తున్నాడ‌ని పేర్కొంటూ ప్ర‌జాకోర్టులో శిక్షించిన‌ట్లుగా మావోయిస్టు కార్య‌ద‌ర్శి ఆజాద్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ‌డిచిన నెల‌న్న‌ర కాలంలో మావోయిస్టు పార్టీకి భ‌ద్రాద్రి జిల్లాలో ఎదురుదెబ్బ‌లే తగిలాయి. ఈనేప‌థ్యంలోనే మావోయిస్టులు కచ్చితంగా ప్ర‌తీకార దాడుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని పోలీస్‌శాఖ స్ప‌ష్ట‌మైన స‌మాచారం అందిన‌ట్లుగా తెలుస్తోంది. అందుకే ఎలాంటి నిర్ల‌క్ష్య వైఖ‌రి అవ‌లంభించ‌కుండా నిర్విరామంగా కూంబింగ్ నిర్వహిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

షెల్ట‌ర్ జోన్‌గా చ‌ర్ల ఏజెన్సీ..

చ‌ర్ల ఏజెన్సీ ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్ట‌ర్ జోన్‌గా మార్చుకుంటున్నారా? అంటే పోలీస్ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. చ‌ర్ల నుంచే గ‌మ్యాల‌కు చేరుకుని ప‌ని పూర్త‌యిన త‌ర్వాత సేఫ్ జోన్‌కు ద‌ళాలు చేరుకునేలా వ్యూహ ర‌చ‌న చేస్తున్నాయ‌ని, అవ‌స‌ర‌మైతే ఇక్క‌డి నుంచి మ‌ళ్లీ ఛత్తీస్‌గ‌ఢ్‌లోకి వెళ్లేందుకు అట‌వీ మార్గాలుండ‌టం, అక్క‌డి ఆదివాసీ, గిరిజ‌నం కావాల్సినంత స‌హ‌కారం అందించేందుకు సిద్ధంగా ఉండ‌టం లాంటి అంశాలు మావోయిస్టులకు బ‌లంగా మారిన‌ట్లుగా పోలీసులు విశ్వ‌సిస్తున్నారు.

భయం భయంగా ఏజెన్సీవాసులు ..

మావోయిస్టుల‌కు స‌హ‌కారం అంద‌కుండా చూడ‌టంపైనే ప్ర‌ధానంగా పోలీస్‌శాఖ దృష్టి పెట్టిన‌ట్లుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి అవ‌గ‌త‌మ‌వుతోంది. ఇటీవల భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ద‌త్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న సారాంశం అదే తెలియ‌జేస్తోంది. ప్రధానంగా చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాలలో కూడా పోలీసు నిఘాను పెంచారు. ద‌ళాల స‌మాచారం పోలీస్‌శాఖ‌కు చేర‌వేస్తే ప్ర‌జాకోర్టులో శిక్ష త‌ప్ప‌ద‌ని మావోయిస్టు నేత‌లు హెచ్చ‌రిస్తుండ‌గా, ద‌ళాల‌కు స‌హ‌క‌రించేవారికి చ‌ట్ట‌ప‌ర‌మైన శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని పోలీసులు ముందుస్తుగా తెలియ‌జేస్తున్నారు. అయితే పోలీసుల కూంబింగ్‌లు, మావోయిస్టుల క‌ద‌లిక‌లు రెక్కీల‌తో ఏజెన్సీ వాసుల్లో వ‌ణుకుపుట్టిస్తున్నాయి. ఏ విషయంలో పోలీసులు విచార‌ణ పేరుతో అదుపులోకి తీసుకుంటారోన‌ని, ఏ నెపంతో మావోయిస్టులు ఎలాంటి దారుణానికి పాల్ప‌డుతారోన‌ని భ‌యందోళ‌న చెందుతున్నారు.

Tags:    

Similar News