ఆర్.ఎఫ్.సీ.ఎల్ విచారణలో కొత్త కోణాలు.. అధికార నాయకుని గుట్టు రట్టుయ్యేనా ?
దిశ, గోదావరిఖని: ఆర్.ఎఫ్.సీ.ఎల్ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థలో నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఖద్దరు చొక్కా నాయకులు ఉద్యోగుల దందాను నిర్వహిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా ఆర్.ఎఫ్.సీ.ఎల్ సంస్థలో సెంట్రల్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే ఇతర ప్రాంతాలకు చెందిన సుమారు 100 మందిని విధుల నుండి […]
దిశ, గోదావరిఖని: ఆర్.ఎఫ్.సీ.ఎల్ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థలో నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఖద్దరు చొక్కా నాయకులు ఉద్యోగుల దందాను నిర్వహిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా ఆర్.ఎఫ్.సీ.ఎల్ సంస్థలో సెంట్రల్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే ఇతర ప్రాంతాలకు చెందిన సుమారు 100 మందిని విధుల నుండి పక్కన పెట్టినట్లు ప్రచారం. సుమారు ఒక వ్యక్తి నుండి ఉద్యోగానికి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేశారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు చేపడుతున్న విచారణతో కొంతమంది నాయకులలో అలజడిని సృష్టిస్తుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. దీనిని కప్పిపుచ్చేందుకు కొత్తగా కొంతమందిని విధుల్లోకి తీసుకుంటున్నారనే ప్రచారం సైతం జరుగుతుంది.
ఇది ప్రచారమా.. కల్పితమా..? ఏది నిజం
గత నాలుగు రోజులుగా ఆర్.ఎఫ్.సీ.ఎల్ సంస్థలో సెంట్రల్ విజిలెన్స్ అధికారులు చేపడుతున్న విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారుగా 100 మందిని విధుల నుండి పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. వీరు ఒక్కొక్కరు ఒక్క ఉద్యోగానికి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు కట్టామని అధికారులకు తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వీరి స్థానాల్లో లక్ష్మీపురం గ్రామానికి చెందిన 30 మంది. వీర్లపల్లి గ్రామానికి చెందిన 15 మందితో పాటు స్థానికంగా ఉండే మరో 20 మందిని తొలగించి వారి స్థానాల్లో విధుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరికి ఎటువంటి పాసులు ఇవ్వకుండా కేవలం ఆధార్ కార్డు ద్వారా లోపలికి తీసుకువెళ్లి ఉద్యోగాల్లోకి తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విచారణ అనంతరం మళ్లీ వీళ్లను బయటికి పంపించి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకుంటారనే ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. వెంటనే నూతనంగా విధుల్లోకి తీసుకున్న వారికి అధికారికంగా అర్ ఎఫ్ సీ ఎల్ పాసులు జారీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
అధికార నాయకుడి ముఠా గుట్టు రట్టుయ్యేనా..?
ఆర్.ఎఫ్.సీ.ఎల్ రామగుండం ఎరువుల కర్మాగారంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఈ ఉద్యోగ దందాలో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతుంది. స్థానికంగా ఉండే ఓ గ్రామానికి చెందిన ఒక నాయకుడు గతంలో పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. సదరు వ్యక్తి ఈ ఉద్యోగాల దందాలో కీలక సూత్రధారుడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. విధుల నుండి తొలగించిన సుమారు 100 మందిలో సగానికిపైగా ఈ ఖద్దరు చొక్కా నాయకుడి బాధితులు ఉండడం గమనార్హం. సదరు నాయకుడిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారా లేదా అనే అనుమానాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇంకా ఈ ఖద్దరు చొక్కా నాయకుడి బాధితులు ఇంత మంది ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.