చమురు ధరల పెరుగుదల కేసీఆర్ పుణ్యమే.. మీ ఓటు నిజాయితీకా, నియంతకా?
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్ నిజాయితీకి, నియంతకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ బీజేపీ గెలవద్దని ప్రగతి భవన్, అసెంబ్లీ వేదికగా ఎన్నో కుట్రలకు తెరలేపారన్నారు. మాట తప్పడం, మడమ తిప్పే పద్ధతి టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందని ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, నిమ్స్ తరహాలో ఆసుపత్రులు తయారు […]
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్ నిజాయితీకి, నియంతకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ బీజేపీ గెలవద్దని ప్రగతి భవన్, అసెంబ్లీ వేదికగా ఎన్నో కుట్రలకు తెరలేపారన్నారు. మాట తప్పడం, మడమ తిప్పే పద్ధతి టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందని ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, నిమ్స్ తరహాలో ఆసుపత్రులు తయారు చేస్తామని, ఇలా ఎన్నో మాటలు చెప్పి.. ఇప్పుడు నేను అనలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్‌కు కుటుంబం, అధికారం రెండే లక్ష్యాలని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ప్రజల భవిష్యత్ నిర్దేశించే ఎన్నికలు అయినందున హుజురాబాద్ ప్రజలు బీజేపీకి అండగా నిలబడాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పోవడం, బీజేపీ రావడం ఖాయమన్నారు. ప్రతీ ఉపఎన్నికల్లోనూ ఇచ్చిన హామీలనే ఇస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో అహంకారపూరిత పాలన సాగిస్తున్నారని టీఆర్ఎస్‌పై కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు చిత్తశుద్ధితో నిధులు కేటాయిస్తోందన్నారు. రెండు, మూడు రోజుల్లో వంద కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసిన చరిత్ర భారత్‌కే దక్కనుందన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంతలా వ్యాక్సిన్లు ఉత్పత్తి జరగలేదన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల, కుటుంబ, కల్వకుంట్ల తెలంగాణగా మార్చారని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
అధికార పార్టీ నిర్భందాలను ఎదుర్కొంటూ ఈటల గెలుపు కోసం కృషి చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు విష ప్రచారం చేయడం కేసీఆర్‌కు అలవాటేనన్నారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ రహదారులకు నిధులు కేటాయించిందని కొనియాడిన సీఎం ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనా తరువాత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. సిలిండర్లు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి కారణం.. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రపంచ ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలన్న నిర్ణయం జరిగిందన్నారు. అప్పుడు ప్రశ్నించకుండా, ఇప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.