మొదటి త్రైమాసికంలో నిలకడగా భారత ఆర్థిక వ్యవస్థ: NCAER

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి నిలకడగా ఉందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) నివేదిక పేర్కొంది.

Update: 2024-06-26 09:19 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి నిలకడగా ఉందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) నివేదిక పేర్కొంది. పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుపడటం, జీఎస్టీ వసూళ్లలో వృద్ధి, ప్రైవేట్ రంగ కార్యకలాపాలు పుంజుకోవడం కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరును కొనసాగించిందని నివేదిక తెలిపింది. రంగాల వారీగా చూసుకుంటే, వ్యక్తిగత రుణ వృద్ధిలో కొంత క్షీణత ఉన్నప్పటికీ బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. అలాగే, వ్యవసాయ రంగంలో బలమైన వృద్ధికి రుతుపవనాలు తోడ్పాటు అందిస్తున్నాయి. జూన్‌లో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ 'సాధారణం కంటే ఎక్కువ' రుతుపవనాల అంచనాలు వ్యవసాయ రంగానికి సానుకూలంగా ఉన్నాయని నివేదిక తెలిపింది.

NCAER డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా మాట్లాడుతూ, 2024-25లో జీడీపీ వృద్ధి 7 శాతం కంటే ఎక్కువగా 7.5 శాతానికి దగ్గరగా ఉండవచ్చు. మొదటి త్రైమాసికంలో కనిపించిన ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వృద్ధి, స్థూల ఆర్థిక స్థిరత్వం, సాధారణ రుతుపవనాల అంచనాల కారణంగా ఈ రకమైన వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం గురించి మాట్లాడిన ఆయన, దీనిని పరిష్కరించడానికి విస్తృత పాలసీ ఫ్రేమ్‌వర్క్ అవసరం అని అభిప్రాయపడ్డారు. అధిక బేస్ కారణంగా రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత క్షీణించడంతో అక్టోబర్‌లో 25bps రేటు తగ్గింపును నిపుణులు సూచిస్తున్నారు.


Similar News