RBI: 2030 నాటికి విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల ఆధిపత్యానికి ఎండ్ కార్డ్
భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వాటా గణనీయంగా పెరుగుతుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వాటా గణనీయంగా పెరుగుతుంది. దీంతో శిలాజ ఇంధనాల వాడకం చాలా వరకు తగ్గిపోతుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొన్న దాని ప్రకారం, 2030 నాటికి విద్యుత్ ఉత్పత్తిలో శిలాజ ఇంధనాల వాడకం సగానికిపైగా తగ్గుతుందని, ఈ స్థానాన్ని గ్రీన్ ఎనర్జీ అంటే.. సోలార్, పవన వంటి విద్యుత్ ఉత్పత్తి ఆక్రమిస్తుందని పేర్కొంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వాటా 50 శాతానికి పైగా దాటుతుందని కూడా నివేదిక తెలిపింది.
అన్ని దేశాలు కూడా కాలుష్య కారక ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో ఈ రంగంలో పెట్టుబడులు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. ప్రభుత్వంతో పాటు, ప్రైవేటు కంపెనీలు సైతం భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే అని గుర్తించి, ఈ విభాగంపై ప్రధానంగా దృష్టి సారించాయి. శిలాజ ఇంధనాలపై పెట్టుబడి పెట్టే ప్రతి డాలర్‌కు, రాబోయే సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధనానికి సగటున మూడు డాలర్లు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది.
శతాబ్దపు మధ్య నాటికి నికర-సున్నా ఉద్గార లక్ష్యాలను చేరుకోవడానికి, 2030 నాటికి పునరుత్పాదక శక్తి సామర్థ్యం మూడు రెట్లు పెరగడం చాలా అవసరమని, అన్ని విభాగాల్లో కూడా శిలాజ ఇంధనాలను తక్షణమే తగ్గించడం సాధ్యపడదు, ఉక్కు తయారీ, విమానయానం వంటి వాటిలో వీటి వాడకం తగ్గడానికి చాలా సమయం పడుతుందని నివేదిక తెలిపింది.