కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ షాక్ ఇవ్వనుందా.?

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ బహిష్కృత నేత, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఈనెల 16న చేరుతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 2వేల మంది అనుచరులు సైతం పార్టీలో చేరనున్నట్లు మీడియాకు వెల్లడించారు. కానీ, ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు. అసలు చేరుతారా? లేరా? అనేదానిపై సందిగ్ధం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ కూడా చేరికపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వివాదాలకు కేంద్ర బిందుగా మారిన కౌశిక్ రెడ్డిపై […]

Update: 2021-07-15 20:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ బహిష్కృత నేత, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఈనెల 16న చేరుతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 2వేల మంది అనుచరులు సైతం పార్టీలో చేరనున్నట్లు మీడియాకు వెల్లడించారు. కానీ, ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు. అసలు చేరుతారా? లేరా? అనేదానిపై సందిగ్ధం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ కూడా చేరికపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వివాదాలకు కేంద్ర బిందుగా మారిన కౌశిక్ రెడ్డిపై టీఆర్ఎస్ పునరాలోచనలో పడింది.

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే టీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ కన్‌ఫర్మ్ అయిందంటూ తన సన్నిహితులకు చెప్పుకున్నాడు. తనకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడిన ఆడియోలు వైరల్ అయ్యాయి. ఆడియో వైరల్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ఆయన కెరీర్‌ డామేజ్ అయిందంటూ హుజురాబాద్‌లో బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. అయినా టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికీ తనకే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు సన్నిహితులకు చెప్పుకున్నారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.

కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కౌశిక్‌కు మాణిక్యం ఠాగూర్ మధురై కోర్టు నుంచి లీగల్ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని, లేదా రూ. కోటి నష్టపరిహారంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో వివరించారు. వివాదాలకు కేంద్ర బిందుగా మారిన కౌశిక్‌పై టీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఒక వైపు ఆడియో, మరో వైపు కోర్టు నోటీసుల నేపథ్యంలో పార్టీలో చేర్చుకుంటే ఓట్లు పడతాయా? లేదా? పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందా? అనే అంశంపై చర్చిస్తోంది. పార్టీ టికెట్ ఇచ్చే ఆలోచనతో చేర్చుకోవాలని భావించినప్పటికీ ఇటు పార్టీగానీ, అటు కౌశిక్ రెడ్డి గానీ ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదు. కౌశిక్ రెడ్డి పొలిటికల్ కేరీర్ ముగిసినట్లేనని నియోజకవర్గ నేతలు పేర్కొంటున్నారు.

టికెట్ ఇచ్చే ఆలోచనతో..

హుజురాబాద్‌లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కౌశిక్ 61 వేల ఓట్లు సాధించాడు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడిన తర్వాత అక్కడ గట్టిపోటీ నిచ్చే అభ్యర్థికోసం పార్టీ అధిష్టానం ఎదురు చూస్తున్నది. కొంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఓట్లు, యూత్ ఫాలో ఆఫ్ ఉన్న కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చే ఆలోచన చేసింది. అయితే ఆడియోలు వైరల్ కావడం, కాంగ్రెస్ పార్టీ కేసు నేపథ్యంలో కొంత వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకోకుండా దూరం పెట్టినట్లేనని పలువురు పేర్కొంటున్నారు.

నేడు ఎల్. రమణకు గులాబీ కండువా

టీటీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ శుక్రవారం టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోనున్నారు. 27ఏళ్ల పాటు సుధీర్ఘ అనుభవం ఉన్న రమణ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలిపారు. ఈనెల 12న తెలంగాణ భవన్‌లో ముఖ్యనేతలతో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే. టీడీపీలో తనతో కలిసి పనిచేసి టీఆర్ఎస్‌లో చేరిన సన్నిహితులతో రమణ భేటీ అయ్యారు. పలు అంశాలను చర్చించారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమ, అభివృద్ధికి ఆకర్షితుడనై చేరుతున్నట్లు ప్రకటించారు. అందరూ సహకారం అందజేయాలని కోరారు.

తెలంగాణ భవన్‌కు కేసీఆర్

సీఎం కేసీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరైన ఆయన ఇప్పటి వరకు రాలేదు. రమణ టీఆర్ఎస్‌లో చేరికను పురస్కరించుకొని 5 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. రమణకు గులాబీ కండువాను కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

రమణ షెడ్యూల్..

ఈనెల 16న టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరుతున్నట్లు టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు నారాయణగూడలోని పద్మశాలి భవన్‌లో మహిళా కార్యకర్తలతో సమావేశం, మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్కులోని అమర వీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో నిర్వహించే సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ కండువా కప్పనున్నారని, తనతో పాటు సుమారు 500లకు పైగా తన సన్నిహితులు పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నేపథ్యంలో సభ ఏర్పాటు చేయలేదని, కొద్ది మంది ముఖ్యులతోనే చేరుతున్నట్లు రమణ ప్రకటించారు.

Tags:    

Similar News