పల్లెల్లో పెట్రేగిపోతున్న 'లిక్కర్' మాఫియా.. పట్టించుకునే నాధుడే లేడా?
దిశ, ఓదెల: పట్టణాల్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఉదయం నుంచి మొదలుకొని అర్ధరాత్రి వరకు అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో మద్యం ఏరులై పారుతుంది. బెల్టు షాపులు లేవని అధికారులు చెబుతున్నా.. అవి లెక్కల వరకే పరిమితమవుతున్నాయి. నూతన ఎక్సైజ్ మద్యం పాలసీని తీసుకువచ్చి ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన […]
దిశ, ఓదెల: పట్టణాల్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఉదయం నుంచి మొదలుకొని అర్ధరాత్రి వరకు అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో మద్యం ఏరులై పారుతుంది. బెల్టు షాపులు లేవని అధికారులు చెబుతున్నా.. అవి లెక్కల వరకే పరిమితమవుతున్నాయి. నూతన ఎక్సైజ్ మద్యం పాలసీని తీసుకువచ్చి ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్టుషాపు నిర్వాహకులకు హద్దులు లేకుండా పోతుంది. దీంతో వారి వ్యాపారం మూడు క్వాటర్లు, ఆరు బీర్లుగా కొనసాగుతోంది. రెండు మండలాల్లో దాదాపుగా అన్ని గ్రామాల్లో లెక్కలేనన్ని బెల్టు షాపుల నిర్వహణ కొనసాగుతుందంటే.. ఎక్సైజ్ అధికారుల పని తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓదెల మండల కేంద్రంలో బ్రాండీ షాప్ ఉన్నప్పటికీ అదే గ్రామంలో సుమారు 18 బెల్టు షాపులు ఉన్నట్లు సమాచారం.
సమయం ఎంతైనా మద్యం దొరుకును
ఓదెల ,కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలన్నీ మత్తులో జోగుతున్నాయి. గ్రామాలు, తండాలు అనే తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టు షాపుల సమయపాలన లేకుండా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటున్నాయి. గ్రామాల్లోని కూలి పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలి పనులకు సైతం పోకుండా నిత్యం గ్రామాల్లో మద్యం మత్తులో ఉంటున్నారు. బ్రాందీ షాప్ యజమానులు బెల్టు షాపులకు ఎమ్మార్పీ రేటు కంటే ఒక మద్యం బాటిల్ పై రూ.5 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని బెల్టు షాపు విక్రయదారులు మద్యం ప్రియుల వద్ద రూ.25 నుంచి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్ గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కిరాణా షాపులు బెల్టుషాపులుగా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జనే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాలలో బెల్టుషాపులు నిర్వహించే వారికి డోర్ డెలివరీ ఇచ్చి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నిషేధం బుట్టదాఖలు..
గ్రామాల్లో మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు అనారోగ్యం పాలవడంతో పాటు మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఓదెల ,కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి ఎక్సైజ్ అధికారులు గ్రామాల వైపు చూసి చూడనట్లు వ్యవహరించడంతో మద్యం వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. బెల్టు షాపుల నిర్వహణపై నిషేదం ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేక వ్యాపారులు రెచ్చిపోతున్నారు.
నిషేధిత ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు
ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంతో ఓదెల ,కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సుమారు 250కి పైనే ఉన్నాయని స్కూల్స్, గుడి పరిసరాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇదంతా నడుస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మద్యం విక్రయించే బెల్టుషాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని బ్రాండీ షాప్ యజమానులు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ అమ్ముతున్నారు. అలాగే బ్రాందీ షాపుల్లో పర్మిట్ పేరుతో అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ,ఎక్సైజ్ సూపరింటెండెంట్, సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐలకు ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు శూన్యం’ అని ఫిర్యాదుదారుడు దొడ్డ శంకర్ తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బ్రాందీ షాప్ ,బెల్టు షాపు విక్రయదారులపై తగిన చర్యలు తీసుకోకపోతే గ్రామాల్లో మహిళల చేత బెల్టుషాపులలోని మద్యాన్ని ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు.