78 ఏళ్లుగా ఎదురు చూపులు.. ఎట్టకేలకు రోడ్డు పనులకు మోక్షం

నిధులు మంజూరైనా కేవలం అటవీ శాఖ అనుమతుల్లేవంటూ రోడ్డు పనులు ఆగిపోయాయి. ఆ ప్రాంత గిరిజనులు వివిధ మార్గాల్లో నిరసనలు ప్రదర్శించారు.

Update: 2025-03-17 02:29 GMT
78 ఏళ్లుగా ఎదురు చూపులు.. ఎట్టకేలకు రోడ్డు పనులకు మోక్షం
  • whatsapp icon

దిశ, పాడేరు: నిధులు మంజూరైనా కేవలం అటవీ శాఖ అనుమతుల్లేవంటూ రోడ్డు పనులు ఆగిపోయాయి. ఆ ప్రాంత గిరిజనులు వివిధ మార్గాల్లో నిరసనలు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆదివాసీల ఆందోళన విన్న కలెక్టర్ దినేష్ కుమార్, నిలిచిపోయిన రోడ్డు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బురిగాం, చిన్న కొనెల గిరిజనులు ధింసా నృత్యంతో జిల్లా యంత్రాంగానికి ఆదివారం ధన్యవాదాలు తెలియజేశారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ కొండ శిఖర గ్రామాలైన బురిగాం, చిన్న కొనెల గ్రామాలతో పాటు సమీపంలోని ఎన్.ఆర్.పురం పంచాయతీ రాయిపాడు. సిమిడి వలస, బొంగిజ, డేంజర్ వలస, పెద్ద వలస తదితర 26 గ్రామాల్లో 12 వందల మంది గిరిజనులు ఉన్నారు.

వీరంతా రోడ్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. చిన్నకోనెల వయా బరుగాం మీదుగా రోడ్డు ఇక్కడ చాలా కీలకమైనది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 2024లో సోములు తమ్మయ్య అనే వ్యక్తి కుమారుడి శవాన్ని 8 కి.మీ మేర మోసుకుని తరలించిన ఘటన జాతీయ స్థాయిలో అందర్నీ కదిలించింది. దీంతో యంత్రాంగం కదిలొచ్చి జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.3 కోట్ల నిధులు మంజూరు చేశారు. కొద్ది రోజుల్లోనే రోడ్డు పనులు మొదలెట్టారు. ఫారెస్ట్ అనుమతులు లేవని నిలిపేశారు. దీంతో గిరిజనులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రెండు వారాల క్రితం కూడా నెత్తిపై అడ్డాకులు పెట్టుకొని అర్ధనగ్న ప్రదర్శన తో ఆందోళనకు దిగారు. డోలీలనే అంబులెన్స్ గానే వాడుతున్నామంటూ నిరసన వ్యక్తం చేశారు.

దీంతో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు సైతం స్పందించి అల్లూరి కలెక్టర్ తో పాటు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ కి కూడా రోడ్డు విషయమై ప్రత్యేకంగా లేఖలు రాశారు. స్పందించిన కలెక్టర్ దినేష్ కుమార్ ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆదివాసీలంతా ముఖానికి రంగులు పూసుకుని, థింసా నృత్యంతో ఆనందం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ల తర్వాత తమ ప్రాంతానికి రోడ్డు రావడం సంతోషంగా ఉందని సోమిల అప్పలరాజు, రొంపిల్లి పంచాయతీ 10వ వార్డు సభ్యుడుతో పాటు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. గోవిందరావు కలెక్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.


Similar News