ఆయన చతురత వల్లే ఎస్సీ వర్గీకరణ: మందకృష్ణ మాదిగ ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు చతురత వల్లే ఎస్సీ వర్గీకరణ జరుగుతోందని మందకృష్ణ మాదిగ అన్నారు....

దిశ, వెబ్ డెస్క్: ఎస్సీ వర్గీకరణ(SC Classification) తీర్మానం ఏకగ్రీవం కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే(Cm Chandrababu) కారణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(MRPS founding president Mandakrishna Madiga) అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. 1997-98లో తొలిసారి ఎస్సీవర్గీకరణ తీర్మానం ప్రవేపెట్టిన ఘటత కూడా చంద్రబాబుదేనని ఆయన గుర్తు చేశారు. 30 ఏళ్ల పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని, వారికి తమ పోరాటాన్ని అంకితం చేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎస్సీ వర్గీకరణ వైపే చంద్రబాబు నాయుడు నిలబడ్డారని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణపై 1996 మహాసభలో చంద్రబాబు తొలిసారి హామీ ఇచ్చారని మందకృష్ణ చెప్పారు. అప్పటి నుంచి చిత్తశుద్ధితో కృషి చేయడం వల్లే ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఏకగ్రీవం అయిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 1997లో తాను పాదయాత్ర చేపట్టానని, ఆ సమయంలో చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకున్నానని పేర్కొన్నారు. మోడీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి తమకు అండగా నిలచారని చెప్పారు. పవన్ కల్యాణ్ సైతం తమకు మద్దతు ఇచ్చారని మందకృష్ణ మాదిగ తెలిపారు.