వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్కు నిరసనగా పులివెందులలో నిరసన
వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు.
దిశ ప్రతినిధి, కడప: పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో స్వచ్ఛందంగా వ్యాపారస్తులు దుకాణాలు మూసివేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు , పాత్రధారులను విడిచిపెట్టి వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదన్నారు. వివేకా హత్య కేసులో కుట్ర కోణాన్ని చేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పాత నివేదిక ఆధారంగా అరెస్టులు చేయడం కోర్టులను మోసగించడమేనని ఆరోపించారు.
గత నివేదిక ఆధారంగా అరెస్టులు చేయడం కోర్టులను తప్పుదోవ పట్టించడమేని పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు దొరికిన లేఖ దాచడం వెనుక నిజాలు బయటకు రావాలన్నారు. డబ్బుల కోసం మనిషి ప్రాణాలు తీసిన కిరాయి హంతకుడు దస్తగిరి వాంగ్మూలాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకుంటారని ప్రశ్శించారు. వైఎస్ కుటుంబానికి మచ్చ తెచ్చేలా టీడీపీ ఆడిన కుట్రలో సీబీఐ పావుగా మారిందన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే పదే చెప్పి ప్రజలను, అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా పచ్చ మీడియా పచ్చ బ్యాచ్ చేసిన పన్నాగం ఇది అని అన్నారు. అరచేయి పెట్టి సూర్యున్ని ఆపలేరని.. అలానే అరెస్టు చేసినంత మాత్రాన అసత్యం సత్యం కాదని అన్నారు. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఈనాటిది కాదని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా, చివరకు సత్యమే జయిస్తుందని అన్నారు. సీబీఐ విచారణ నుంచి కడిగిన ముత్యంలా వైఎస్ భాస్కర్ రెడ్డి బయటపడతారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.
వివేకా హత్య కేసులో న్యాయం గెలవాలి
వివేకా హత్యకేసులో న్యాయం గెలవాలి.. నిజం బయటపడాలి అనేది వైఎస్ అవినాష్ రెడ్డి ఆకాంక్షించారని అన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, సమయం పట్టవచ్చు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుందని నిరసనకారులు అన్నారు. పులివెందుల పాత బస్టాండ్ నుంచి పూలంగళ్ళ సర్కిల్ దాకా శాంతియుత ర్యాలీ నిర్వహించారు.