రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది.. Nara Lokesh

రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందని నారా లోకేశ్ విమర్శించారు.

Update: 2023-05-24 15:04 GMT

దిశ ప్రతినిధి, కడప: తాను అధికారంలోకి వస్తే రైతు రాజ్యం తెస్తానని చెప్పిన జగన్ పరిపాలనలో ఎక్కడా రైతు రాజ్యం కనపడలేదని , తాను 109 రోజులుగా చేస్తున్న పాదయాత్రలో ఇది రైతు రాజ్యమా, రైతులేని రాజ్యమా అన్న దుస్థితి కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉందని, కౌలు రైతులు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు బిగిస్తున్న మీటర్లు సీమ రైతులకు ఉరి తాళ్ళుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం, గండికోట , రాజోలు ప్రాజెక్టులకు పరిహారం కూడా చెల్లించలేదని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం రాత్రి కడప జిల్లాకు చేరింది. బుధవారం సాయంత్రం నుంచి జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం సుద్దపల్లె నుంచి మొదలైంది. ఈ సుందర్బంగా లోకేశ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో వున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలవరం, గండికోట, రాజోలి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందిస్తామని తియ్యని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తామన్నారని అవేమి కనిపించ లేదన్నారు.

సీబీఐ చుట్టూ వ్యవసాయ మంత్రి చక్కర్లు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ చుట్టూ తిరుగుతున్నారన్నారు. మంత్రి ఏనాడైనా రైతుల వద్దకు వచ్చారా? వ్యవసాయ శాఖ మంత్రి కనబడటం లేదని బోర్డు పెట్టాలా అన్నారు. 2020లో జగన్ ఇక్కడికి వచ్చి గండికోటలో 26 టీఎంసీల నీరు పెట్టడం నా అదృష్టమని, బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారని గుర్తు చేశారు.అయనా ఆ తర్వాత ఏం చేశారని ప్రశ్నించారు. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే మీ సమస్యలు తీరుతాయని అయితే జగన్మోహన్ రెడ్డి పట్టించు కోవడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు.రూ.665 కోట్లతో నాడు చంద్రబాబు మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించడానికి నిధులు కేటాయించారన్నారు.తిరిగి మేము అధికారం లోకి వేస్తే గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల్లో పరిహారం రాని వాళ్లకు పరిహారం అందిస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రాత్రికి రాత్రి పోలీసులను మిమ్మల్ని ఖాళీ చేయించారన్నారు. సీఎం సొంత జిల్లాలోనే రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలోని రైతులకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు.

మేమొస్తే న్యాయ బద్దమైన పరిహారం

టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయబద్ధమైన పరిహారం, ముంపు కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు. గండికోట నిర్వాసితులకు చిన్నతరహా పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. గతంలో పాడి రైతులకు సబ్సీడీలు ఉండేవి విని ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం కూల్చేసిందన్నారు.. టీడీపీ వచ్చాక పాడి రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ఎన్నికల ముందు జగన్ రైతు రాజ్యం తెస్తానని చెప్పారని, తాను 108 రోజులుగా రాయల సీమలో పాదయాత్ర చేస్తున్నా..కానీ ఇక్కడ రైతులేని రాజ్యంగా కనిపిస్తోందని విమర్శించారు. నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోతున్నామని ఇక్కడి రైతుల చెబితే... కాదు రైతుల తప్పిదాలతోనే వాళ్లు నష్టపోతున్నారని ఇక్కడి పార్లమెంట్ సభ్యుడు రిపోర్టులు తయారు చేయించారని విమర్శించారు.

డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశారు

ఈ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సీడీ ఎత్తేశారని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అందించడం లేదన్నారు. రైతులకు కనీసం ఇప్పుడు ట్రాన్స్ ఫార్మర్లు కూడా ఇవ్వడంలేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇన్ పుట్ సబ్సీడీ రద్దు చేసిందని, పెట్రోల్, డీజల్ ధరలు పెరగడంతో ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయని, పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రావడం లేదని తెలిపారు.

అందర్నీ గెలిపించినా మీ జీవితాలు మారాయా?

2014లో ఒక్క ఎమ్మెల్యేనే కడప జిల్లాలో టీడీపీని గెలిపించారని, అయినా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించడంతో పాటు పులివెందులకు నీళ్లు కూడా అందించామన్నారు. 2019లో అన్ని స్థానాల్లో వైసీపీని గెలిపించారని, మీ జీవితాలు ఏమైనా మారాయా? అని లోకేష్ ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లాలో పనులు కావడం లేదంటే ఆలోచించాలని కోరారు. జగన్ కు మతిమరుపు ఎక్కువని, పొద్దున చెప్పింది. సాయంత్రానికి గుర్తు ఉండదన్నారు. శనగకు రూ.4,800 మద్ధతు ధరతో గతంలో మేము మద్ధతు ధర అందిచామన్నారు.

సీమకు ఏమి చేయబోతున్నామని వెల్లడిస్తాం

రాయలసీమలో పాదయాత్ర ముగించుకొని వెళ్లేలోపు సీమకు ఏం చేయబోతున్నామో వెల్లడిస్తామన్నారు. సీమలో మామిడి, టమోటాకు ప్రాసెసింగ్ యూనిట్లు రావాలన్నారు. గతంలో రూ.70 వేలు ఉన్న రైతు తలసరి అప్పు వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.2.50లక్షలకు పెరిగిందన్నారు. రాజోలి ప్రాజెక్టు సామర్థ్యం గతంలో 2.9 టీఎంసీలు అని ఇప్పుడు 1.6 టీఎంసీలు అని జగన్ అంటున్నారు. పూటకో మాట మాట్లాడటం వల్ల రైతులు ఇబ్బంది పడతున్నారన్నారు. ముంపు వాసులకు పరిహారం రూ.20 లక్షలు ఇవ్వాలన్న దానిపై పార్టీ అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీపీ హయాంలో చేతినిండా పని ఉండేదని, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రైతుల నుండి వెయ్యి ట్రాక్టర్లు ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారన్నారు.

గతంలో మీకు ఇచ్చిన సబ్సీడీలు మళ్లీ అమలు చేస్తామన్నారు. మామిడి, చీని, దానిమ్మ వంటి హార్టి కల్చర్ పంటలను ప్రోత్సహించాలని, ఉపాధిహామీని గతంలో హార్టి కల్చర్ కు అనుసంధానం చేసే సమయంలో ప్రభుత్వం మారిపోయిందన్నారు.కొత్త రకాల మామిడి తీసుకురావాలి. మామిడి పరిశోధనాకేంద్రం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వచ్చాక పల్లెలను పట్టించుకోవడం లేదు. పంచాయతీలను నిర్వీర్యం చేశారు. టీడీపీ హాయంలో వేసిన రోడ్లు, బ్రిడ్జిలే ఇంకా ఉన్నాయన్నారు.

అడుగడుగునా ఆదరణ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడప జిల్లాలో చేపట్టిన మొదటి రోజు పాదయాత్రకు అడుగడుగునా ఆదరణ లభించింది .పెద్ద ఎత్తున దేశం కార్యకర్తలు ,ప్రజలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు ,సాయంత్రం నాలుగు గంటల తర్వాత పెద్దముడియం మండలం సుద్దపల్లి నుంచి మొదలైన పాదయాత్ర గాజులపల్లి,జె.కొట్టాలపల్లి మీదుగా సాగి జె. కొట్టాలపల్లి పెద్ద పసుపులమధ్య పాదయాత్ర క్యాంప్ ఆఫీస్ కు చేరింది .ఈ పాదయాత్రలో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి.జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి భూపేష్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News