Ys Viveka Murder Case: ఎంపీ అవినాష్‌ను అరెస్ట్ చేస్తారా!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...

Update: 2023-03-09 15:33 GMT

దిశ, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు విచారణలో ఇప్పటికే రెండుసార్లు అవినాష్ రెడ్డి విచారించిన సీబీఐ తాజాగా 160 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. దీంతో అరెస్ట్ చేస్తారేమోనన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది. సీఎం జగన్ బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కోవడం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు వివేక హత్య కేసుపై ఇప్పటికే తెలుగుదేశం తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వివేకా హత్య కేసు విచారణ వైసీపీని రాజకీయంగా కుదిపేస్తోంది.

ఇదిలా ఉంటే ఎంపీ అవినాష్ రెడ్డి తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు సీబీఐ అధికారులు 160 సీఆర్పీసీ నోటీస్ ఇచ్చారని, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వడంతో పాటు లాయర్ సమక్షంలో తనను విచారించాలని కోరారు. ఇలా అవినాశ్ రెడ్డి పిటిషన్ వేయడం ఆయనను సీబీఐ అరెస్ట్ చేయబోతోందన్న అనుమానాలకు తావిస్తోంది. ఇందులో భాగంగానే అవినాష్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం మూడోసారి సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. వివేకా హత్య కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయిన తర్వాత విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. అవినాష్ రెడ్డికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసి జనవరి 28న ఒకసారి, ఫిబ్రవరి 24న మరోసారి విచారించింది. ఈ సందర్భంగా సీబీఐ పలు రకాల ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నిందితుల విచారణ అభియోగ పత్రాల్లో అవినాష్ రెడ్డి పేరు ప్రస్థానకు రావడంతో ఆయనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ చేపట్టింది. తనకున్న పలు అనుమానాల కోణంలో సీబీఐ రెండుసార్లు అవినాష్‌ను విచారించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరోసారి విచారించేందుకు ఈ నెల 6న రావాలని నోటీసులు చేసింది. దీంతో పదో తేదీన విచారణకు హాజరవుతానని అవినాశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో జరిగే విచారణకు హాజరుకావడం ఉత్కంఠకు దారి తీస్తోంది.

Tags:    

Similar News